16 May, 2026 | 6:29 PM

బావిలో ఈత కొడుతూ యువకుడు మృతి

16-05-2026 05:40 PM

ఊర్కొండ: బావిలో ఈత కొడుతూ యువకుడు మునిగి మృతి చెందిన విషాద ఘటన ఊర్కొండపేటలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఊర్కొండపేట శివారులో శనివారం గ్రామ పంచాయతీ కార్మికురాలు వర్కల మల్లమ్మ చెల్లెలి కుమారుడు కాలే అనిల్ (20) తన పెద్దమ్మ వద్ద ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని బావిలో తన సోదరులు, మిత్రులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు.

సుమారు గంటపాటు 30 మందికి పైగా యువకులు ఈత కొడుతున్న సమయంలో అనిల్ కనిపించకపోవడంతో తోటి యువకులు గాలింపు చేపట్టారు. అయినప్పటికీ అతడి జాడ కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కల్వకుర్తి ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది బావిలో గాలించి అనిల్ మృతదేహాన్ని బయటికి తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతుడి కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మృతుడు కాలే అనిల్, తండ్రి కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.