22 April, 2026 | 4:39 PM

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!

22-04-2026 03:02 PM

- యువకుడు మృతి

- కుటుంబ సభ్యుల ఆందోళన

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా యువకుడు మృతి చెందిన ఘటన బుధువారం చోటు చేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన యువకుడు (పూజారి) చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం కోడేరు మండల కేంద్రానికి చెందిన టిఎన్ రామకృష్ణ మూర్తి(28) పలు ఆలయాల్లో పూజారిగా పనిచేస్తున్నాడు.

గత మూడు రోజుల క్రితం కడుపునొప్పితో బాధపడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మణికంఠ గ్యాస్ట్రో ఆసుపత్రికి రాగా అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి హై కొలెస్ట్రాల్ షుగర్ గ్యాస్ట్రో వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించి అడ్మిట్ చేసుకున్నారు. మంగళవారం సాయంత్రంలోగా డిశ్చార్జ్ కూడా చేస్తామని చెప్పారని ఈ ఒక్కరోజు అబ్జర్వేషన్ అనంతరం వెళ్ళిపోవచ్చు అంటూ వైద్యులు తెలిపారని అంతలోనే పరిస్థితి విషమించినట్లు తెలిపారని బంధువులు లక్ష్మణ్ స్వామి తెలిపారు.

తమ బిడ్డ పరిస్థితి విషమించిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని చికిత్స సమయంలో రోగికి ఆక్సిజన్ అందించకపోవడంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. బాధితుడి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆసుపత్రి వైద్యులు జగదీష్ ను వివరణ కోరేందుకు ఫోన్ లైన్ సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.