16 August, 2026 | 2:51 AM

అపురూపం.. ఉడాన్ పథకం

16-08-2026 12:30 AM

పూర్ణచంద్ర రావు :

భారతదేశ విమానయాన రంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రకు మరో కీలక మౌలిక వసతి అందుబాటులోకి వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురంలో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన లిలి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు.

దీంతో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 166 విమానాశ్రయాల ద్వారా ప్రయాణికులు, సరకు రవాణా రాకపోకలు కొనసాగుతున్నాయి. దేశంలో విమానయాన మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయనడానికి ఈ సంఖ్య ఒక నిదర్శనంగా నిలుస్తోంది. విమానాశ్రయాల సంఖ్య 166కు చేరిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వెల్లడించారు. జీఎంఆర్ గ్రూప్ అభివృద్ధి చేసిన భోగాపురం విమానాశ్రయం ఈ నెల 1న అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, ఇక్కడి నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలు ఆగస్టు 17, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం 2,203.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఎయిర్‌బస్ 350, బోయింగ్ 777 వంటి వైడ్ బాడీ విమానాల రాకపోకలకు అనువుగా 3,800 మీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ విమానాశ్రయం సాలీనా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మానం జరిగింది.  ఆధుని క సదుపాయాలు, భారీ విమానాల రాకపోకలకు అనుకూలమైన రన్‌వే, అధిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యంతో ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో విమానయాన రంగానికి కీలక కేంద్రంగా మారనుంది.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉండగా నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటి సంఖ్య 166కి చేరటం చూస్తే ఉడాన్ పథకానికి మోదీ ఎంత ప్రాధాన్యమిస్తున్నారో తెలుస్తోంది. ఉడాన్ అంటే భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకం. ఈ పథక ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని కల్పించడంతో పాటు చిన్న, మధ్యతరహా నగరాలను విమాన సేవలతో అనుసంధానించడం. 

67 ఏళ్ల పాలనలో కేవలం 74 విమానాశ్రయాలు వుండగా కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన 12 ఏళ్లలో 92 విమానాశ్రయాలు నెలకొల్పింది. ఉడాన్ పథకం కింద పేదలకు చౌకగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించటమే ప్రధాన లక్ష్యం. 500 కి.మీ దూరం గంట ప్రయాణం కోసం కేవలం 2,500 రూపాయలతో సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసే వెసులుబాటు కలిగింది. విమానం చూడటమే తప్ప జీవితంలో అందులో ప్రయాణించలేమని భావించిన సామాన్య పల్లె జనులకు  ప్రధాని మోదీ ఆలోచనతో అపూర్వ అవకాశం దక్కింది.

‘ఉడాన్’ ముఖ్య ఉద్దేశాలు

చౌకగా ప్రయాణికులను తీసుకెళ్లే విమానయాన సంస్థలకు నష్టాలు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’  (వీజీఎఫ్ )ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాయి. విమానాశ్రయాలే కాకుండా హెలిపాడ్లు, వాటర్ ఏరోడ్రోమ్లను (సీ-ప్లెన్లు) కూడా అనుసంధానం చేయటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి, ప్రాంతీయ విమానయానానికి రూ.28,840 కోట్లతో బడ్జెట్‌లో సవరించినందున ఉడాన్ పథకానికి ఆమోదం లభించింది.

దీనివల్ల మారుమూల ప్రాంతాలు, ద్వీపాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావటం హర్షణీయం. అంతేకాకుండా 2045 సంవత్సరం నాటికి దేశ వ్యాప్తంగా 400 విమానాశ్రయాలను నిర్మాణం చేసి, సాలీనా 50 కోట్ల మంది ప్రయాణం చేయాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించటం అభినందనీయం.

ఇదిలా ఉండగా గత ఆర్థిక సంవత్సరం భారతీయ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించిన దేశీయ ప్రయాణికుల సంఖ్య సుమారు 16.77 కోట్లు.  2024 -25 తో పోలిస్తే ఈ సంఖ్య 1.4 శాతం అధికం. ఉడాన్ పథకం ప్రాచుర్యం పొంది విమానయానంపై సామన్యుల్లో సైతం ఉత్సాహం పెరగటమే ఈ వృద్ధికి కారణం.

ఇక్కడొక విషయం ప్రస్తావించక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని రాజధాని అమరావతిలో దాదాపు రూ.3,409 కోట్ల పెట్టుబడితో 4,618 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలాన్ని గుర్తించగా, దీని నిర్మాణం, భూసేకరణకు సంబంధించిన పనులు ప్రణాళిక దశలో ఉన్నట్టు సమాచారం.

అయితే ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం సేకరించిన, సేకరిస్తున్న భూమి పూలింగ్ లేదా భూ సేకరణ విషయంలో అనేక ఉద్యమాలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రాజధానికి కేవలం 20 నిమిషాల్లో చేరగలిగే 20 కి.మీ దూరంలో వున్న గన్నవరం విమానాశ్రయం అన్ని హంగులతో అభివృద్ధి చెంది ఉండగా, సమీపంలో మరొక విమానాశ్రయం ఎందుకనే ప్రశ్న ఉదయిస్తోంది.

బెంగళూరు లోని కెంపెగౌడ, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ , ముంబైలోని ఛత్రపతి శివాజీ,  ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ముఖ్య ప్రాంతాలకు ఉన్న దూరం లెక్కిస్తే గన్నవరం విమానాశ్రయమే రాజధానికి అత్యంత సమీపంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు విమాన సౌకర్యం కలిగి ఉంది. ఈ విమానాశ్రయం కేవలం నైసర్గికంగా కృష్ణా జిల్లాలో ఉండటంతో మరొక విమానాశ్రయం తెరమీదకు వచ్చిందని, దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు వైభవం కోల్పోతుందని కృష్ణా జిల్లా ప్రజలు అనుమానిస్తున్నారు.

వాస్తవానికి గన్నవరం విమానాశ్రయాన్ని   రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని రన్‌వే.. సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో నిర్మించిన భోగాపురం రన్‌వే కంటే  వెయ్యి అడుగుల మేర తక్కువగా, 11.024  వేల అడుగుల పొడవు,148 అడుగుల వెడల్పు కలిగి ఉండటంతో భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా అభివృద్ధి చెందింది.

ఈ ప్రాంతం నుంచి ఎయిర్‌ట్రాఫిక్ పెరుగుదల కారణంగా, భారతదేశ విమానాశ్రయాల అథారిటీ విమానాశ్రయానికి అభివృద్ధి, మౌలిక వసతుల్లో మార్పులు చేపట్టి అనంతరం 2017 ఆగస్టులో  అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు. సింగపూర్‌కు మొదటి అంతర్జాతీయ విమాన సేవ 2018 డిసెంబరు 4 నుంచి ప్రారంభించారు. 2019 జూలైలో అప్పటి రాష్ట్రప్రభుత్వం రాయితీ తొలగించడంతో రద్దయినది. కార్గో సేవలు కూడా 2018 ఆగస్టు నుండి అందుబాటులోకి వచ్చాయి.

హజ్ యాత్రకు ఇక్కడి నుండి నేరుగా వెళ్లే సదుపాయం భారత ప్రభుత్వం కల్పిస్తోంది. ఇన్ని హంగులు దిద్దుకున్న గన్నవరం విమానాశ్రయం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 14,11,325 మంది ప్రయాణికులు తరలివెళ్లగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 13,83,855 కంటే పెరిగింది. అయితే 2014--15 సంవత్సరం ప్రయాణికులతో పోలిస్తే 504 .18 శాతం అధికంగా నమోదైంది. అయితే అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు.

ప్రస్తుతం ఉడాన్ పథకం ద్వార పెరిగిన విమాన సర్వీసులు,తగ్గించిన రేట్లతో ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణమనే విషయాన్ని ప్రస్తావించాలి. ప్రస్తుతం గన్నవరం నుంచి 20 విమానాలు బెంగళూర్లు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, విశాఖపట్టణంతో పాటు షార్జా, సింగపూర్ అంతర్జాతీయ సర్వీసులు కూడా నిర్దేశిత రోజుల్లో నడుపుతున్నట్లు సమాచారం.

భారీ విమానాల రాకపోకలకు వీలుగా ‘గన్నవరం’

ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందిన సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన గన్నవరం విమానాశ్రయంలో బోయింగ్ -777, బోయింగ్-747, బోయింగ్ -737, ఎయిర్‌బస్ ఏ-320, ఏటీఅర్ -72, బామ్బార్దియర్  క్యూ- 400 లాంటి భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా రూపొందించారు. 24 పార్కింగ్ బేలు కూడా ఉన్నాయి.  అన్ని హంగులతో గన్నవరం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాక అమరావతి ప్రాంతంలో మరొక ఎయిర్‌పోర్టు ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బేగంపేట విమానాశ్రయంలా దీన్ని భౌగోళికంగా కృష్ణా జిల్లా పరిధిలో వుండటం వల్ల దీన్ని మూలన పెట్టేందుకు ఏమైనా తెరవెనక పావులు కదుపుతున్నారా? అనే  అనుమానాలు కృష్ణా జిల్లా ప్రజలు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఎయిర్‌పోర్టుల కంటే గన్నవరం విమానాశ్రయమే అత్యంత దగ్గరగా ఉందన్న సంగతి విస్మరించకుండా, ఘన చరిత్ర కలిగిన దాని ప్రాభవం తగ్గకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ (9491545699)