ఇంద్రాయి దేవతకు విత్తనాల పూజలు..
ఇంద్రాయి పూజలకు తరలివచ్చిన ఆదివాసి గిరిజనులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసుల ఆరాధ్య దేవత ఇంద్రాయి దేవతకు ఖరీఫ్ సీజన్లో ఆదివాసీ గిరిజనులు సాగు చేసే వివిధ రకాల విత్తనాలను దేవతకు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో నివాసముండే ఆదివాసీ గిరిజనులు ఇంద్రవెల్లిలో కొలువుదీరిన ఇంద్రాయి దేవతకు విత్తనాల మొక్కులు తీర్చుకునేందుకు గ్రామాల పటేళ్లు, దేవారిలు, గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వెదురు గుళ్ళలో తీసుకువచ్చిన విత్తనాలను మోదుగు ఆకులో దేవతకు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల పటేల్ లు మాట్లాడుతూ... ప్రతి ఏటా మృగశిర కార్తి ప్రారంభం రోజున indrai దేవతతో పాటు గ్రామదేవతలకు ఖరీఫ్ సీజన్లో సాగు చేసే విత్తనాలను దేవతలకు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం అన్నారు. తమ దేవతలకు ఖరీఫ్ సీజన్లో సాగు చేసే విత్తనాలను దేవతలకు సమర్పిస్తే దిగుబడులు రావడంతో పాటు పంటకు వ్యాధులు రావని, పంటలు బాగుంటాయని వారు తెలిపారు. దేవతలకు విత్తనాలు సమర్పించిన తర్వాతే భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిలో విత్తనాలు నాటుతామని వారు వివరించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసి గిరిజనులు తరలిరావడంతో ఇంద్రాయి ఆలయం జనంతో నిండిపోయింది.






