ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు
ఛాయాచిత్రం ఒక కళ..
కాలాన్ని భద్రపరిచే అద్భుత మాధ్యమం
ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ప్రభుత్వం సహకరించాలి
కల్లూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను కల్లూరు మండల ఫోటోగ్రాఫర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించి, కెమెరా సృష్టికర్త లూయిస్ డాగెర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ.. ఛాయాచిత్రం కేవలం చిత్రం కాదని, అది ఒక కళ, జ్ఞాపకం, చరిత్రకు ప్రతిరూపమని అన్నారు.
కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనలను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు జీవితంలోని మధుర జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచేది ఫోటోగ్రఫీ అని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చినా మంచి ఛాయాచిత్రం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. సమాజంలోని ముఖ్య సంఘటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రజల జీవితాల్లోని ప్రత్యేక ఘట్టాలను కెమెరాల్లో బంధిస్తూ ఫోటోగ్రాఫర్లు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోటోగ్రాఫర్లకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, కెమెరాలు–పరికరాల కొనుగోలుకు రుణ సదుపాయం, వృత్తిపరమైన శిక్షణ, సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్స్ కమిటీ అధ్యక్షులు మోదుగు రాంబాబు, సెక్రటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ వెంకట్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు చల్లా వెంకటేశ్వరరావు, హబీబ్, బీవీ, మర్రేల వెంకటేశ్వరరావు, రోజ్ వేణు, వెంకట్, కృష్ణ, డేవిడ్, ప్రభాకర్, వినోద్, రవి మురళి, సలీం, చిన్న రాంబాబు, సుధాకర్, హ్యూమన్ రైట్స్ కృష్ణవేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






