శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
సీఐ జలెంధర్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, పరస్పర సహకారంతో జీవించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి సీఐ జలెంధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలను బెదిరించడం, డబ్బుల కోసం ఒత్తిడి చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పీర్జాదిగూడ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై దాడి జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో హిజ్రాలకు సామాజిక అంశాలు, చట్టపరమైన బాధ్యతలపై కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.... హిజ్రాలు సమాజంలో అందరితో సమానంగా గౌరవప్రదంగా జీవించేందుకు హక్కు ఉందని, అయితే జీవనోపాధి కోసం చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం లేదా గొడవలకు దిగడం సరికాదన్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా శుభకార్యాలు, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాల సమయంలో నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేయకుండా సహకరించాలని సూచించారు.
డబ్బుల విషయంలో ఒత్తిడి చేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఘర్షణలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు లేదా వివాదాలు ఎదురైతే నేరుగా ఘర్షణలకు దిగకుండా పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. పోలీసుల సూచనలను పాటిస్తూ చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. సమాజంలో అందరూ పరస్పరం గౌరవించుకుంటూ, చట్టాన్ని గౌరవించి సహకారంతో ముందుకు సాగితే హిజ్రాలకు సమాజంలో మరింత గౌరవప్రదమైన గుర్తింపు లభిస్తుందని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి పోలీసు సిబ్బంది, హిజ్రాలు పాల్గొన్నారు.






