19 August, 2026 | 7:33 PM

ఏకలవ్య పాఠశాల ముందు ఆదివాసీ సంఘాల ధర్నా

19-08-2026 06:55 PM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని ముత్తాపురం గ్రామ సమీపంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు మంగళవారం రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తూ బుధవారం ముత్తాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి రాధ, మామకన్ను సర్పంచ్ కల్తి రజిత లు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చుంచ రామకృష్ణకు పూలమాల వేసి ధర్నాను ప్రకటించారు. అనంతరం జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ... ఏకలవ్య మోడల్ స్కూల్లో పై అధికారుల నుండి ఎటువంటి సమాచారం లేకుండా తీజ్ పండుగ నిర్వహించిన లంబాడ ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి.

ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆదివాసీ సంఘ నాయకులు 15 కార్లు, 120 మంది ఆదివాసీ నాయకుల ముసుగులో దాడులకు పాల్పడ్డారని అసత్య ప్రచారాలు చేస్తూ, ఆదివాసీ ఉద్యోగులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనియెడల ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.

ఈ ధర్నా శిభిరాన్ని ఆర్ సీ ఓ అరుణ సందర్శించి, విచారణ జరిపి వారి పైన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని అడిగి తెలుసుకోగా లంబాడ సామాజిక వర్గానికి చెందిన రమేష్, మెస్ మేనేజ్మెంట్ ఉపాధ్యాయుడిపై ఆర్ సీ ఓ కు విద్యార్థులపై జాతి వివక్షత చూపుతున్నారని  ఫిర్యాదు చేశారు. ఆదివాసీ సంఘ నాయకులు నుంచి డిమాండ్ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్ సీ ఓ మాట్లాడుతూ..మీ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, మా దగ్గర సస్పెండ్ చేసే అంత అధికారాలు లేవని అన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, పినపాక జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షులు వెంకట్, పెండకట్ల నాగరాజు, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోటి, మోకాల వీరస్వామి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.