19 August, 2026 | 6:10 PM

చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే అద్భుతమైన సాధనం కెమెరా

19-08-2026 05:39 PM

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే అద్భుతమైన సాధనం కెమెరా అని కాకతీయ ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి, భూపాలపల్లి మండల అధ్యక్షులు కారుకూరి సతీష్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని జయశంకర్ కూడలిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ మండె డాగురె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేకు కట్ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఫోటోగ్రఫీ కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, నాటి జ్ఞాపకాలను, చారిత్రక ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ఫోటోగ్రఫీ రంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.