19 August, 2026 | 6:50 PM

పట్టణంలో కుక్కల బెడద నివారించాలి

19-08-2026 06:02 PM

మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ల వినతి

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలో కుక్కల బెడదను నివారించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ 22, 34వ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనలతో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో కుక్కలను పట్టే కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన ABC వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ, నిబంధనల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. కుక్కల బెడద నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, సరగడ రాజ్యలక్ష్మి అమర్, కో-ఆప్షన్ సభ్యులు సుజయత్ అలీ కౌసర్ పాల్గొన్నారు.