24 April, 2026 | 9:20 PM

టీకాలే పిల్లల ప్రాణాలకు రక్షణ

24-04-2026 08:05 PM

- కామినేని దవాఖానల ఎం’బ్రేస్ వైద్యులు

- టీకాలు తప్పనిసరిగా వేయించాలన్న వైద్యులు 

ఎల్బీనగర్: ప్రాణాపాయ వ్యాధులను అరికట్టడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, టీకాలతో అనేక ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించవచ్చని కామినేని దవాఖానల ఎం’బ్రేస్ వైద్యులు పేర్కొన్నారు. “ప్రపంచ టీకాల వారోత్సవం (ఏప్రిల్ 24 నుంచి 30 వరకు)” సందర్భంగా, కామినేని ఆసుపత్రుల ఎం’బ్రేస్ వైద్యులు అవగాహన కార్యక్రమంలో భాగంగా టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఏడాది “ప్రతి తరానికి టీకాలు పనిచేస్తాయి” అనే సందేశంతో అన్ని వయస్సుల వారు టీకాలు వేయించుకోవాలని సూచించారు.

టీకాలు వ్యక్తులను రక్షించడమే కాకుండా, సామూహిక రోగనిరోధక శక్తి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. టీకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి వైరస్లు , బ్యాక్టీరియాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. పోలియో, తట్టు, రుబెల్లా,  కోరింత దగ్గు, డిఫ్తీరియా, ధనుర్వాతం, హెపటైటిస్-బి, రోటావైరస్ న్యుమోకాకల్ వ్యాధి, హెచ్ పీవీ సంబంధిత క్యాన్సర్లు తదితర తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు. సమయానికి టీకాలు వేయించుకోవడం, సరైన ఆరోగ్య సంరక్షణతో అంటువ్యాధుల పెరుగుదలను గణనీయంగా తగ్గిస్తాయని వివరించారు.

ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్, ఎం’బ్రేస్ డాక్టర్ ఎస్.నరసింహారావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రోగనిరోధక టీకాలు పిల్లల ఆరోగ్య సంరక్షణను మార్చివేశాయన్నారు. టీకాలతో ఒకప్పుడు ఎక్కువగా కనిపించిన అనేక వ్యాధులు ఇప్పుడు తగ్గిపోయాయని చెప్పారు. పిల్లలకు పూర్తి రక్షణ కల్పించడానికి, సిఫార్సు చేయబడిన రోగనిరోధక టీకాల షెడ్యూల్‌ను పాటించడం అత్యవసరమని ఆయన చెప్పారు. కన్సల్టెంట్ పీడియాట్రిషన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, ఎం’బ్రేస్ డాక్టర్ కంచన్ ఎస్. చన్నావర్ మాట్లాడుతూ... ఐసీయూలో చేరే పిల్లల్లో చాలా ఇన్ఫెక్షన్లు టీకాల ద్వారా నివారించవచ్చని తెలిపారు.

రోగనిరోధకత వ్యాధుల తీవ్రతను తగ్గించడమే కాకుండా, ఆసుపత్రిలో చేరడాన్ని మరియు ఇంటెన్సివ్ కేర్ అవసరాన్ని కూడా తగ్గిస్తుందని వివరించారు. కన్సల్టెంట్ పీడియాట్రిషన్ అండ్ నియోనాటాలజిస్ట్, ఎం’బ్రేస్ డాక్టర్ ఆర్.వి. సౌజన్య మాట్లాడుతూ... టీకా కార్యక్రమం పుట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుందని, నవజాత శిశువులు, పసిపిల్లలు అత్యంత బలహీనంగా ఉండే దశల్లో వారిని రక్షించడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి బిడ్డకు టీకాలు సమానంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని సూచించారు. సమావేశంలో కామినేని దవాఖాన వైద్యులు పాల్గొన్నారు.