ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 10న కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ క్లబ్‌లో ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మదిరే అశోక్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే ఈ కార్యశాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్టార్టప్ ఐడియాలు, డీపీఐఐటీ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై నిపుణులు వివరించనున్నారు. ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికి నాణ్యత ప్రమాణాలు, విద్యుత్ శక్తి పొదుపు విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






