డ్రగ్స్, నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడండి
- మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): గంజాయి, నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని మంచిర్యాల డీసీసీ ఎ. భాస్కర్ అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే విద్యార్థులకు గంజాయి-సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ... గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం,భవిష్యత్తు, విద్య,ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు కుటుంబానికి, సమాజానికి భారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు ,సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు,ఫేక్ లింకులు,డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు,బాలికలు ఎలాంటి వేధింపులు, గృహ హింస,సైబర్ వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలు, అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు. మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా,వినియోగం, సైబర్ మోసాలు లేదా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
అదేవిధంగా విద్యార్థుల నుండి ప్రహరీ క్లబ్ ఏర్పాటు గురించి దాని పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.డ్రగ్స్ రహిత,నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం డిసిపి పాఠశాల పరిసర ప్రాంతాలతో పాటు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు .ఈ అవగాహన కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, మాదారం ఎస్సై సౌజన్య ,పాఠశాల ప్రిన్సిపాల్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






