1 July, 2026 | 3:04 PM

కందనూల్ జిల్లాలో ఎన్నికల కమిషనర్ పర్యటన.

01-07-2026 01:43 PM

- ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్, ఎస్పీతో సమీక్ష

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం నాగర్‌ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్ అమలు తీరు, బూత్ స్థాయి అధికారుల పనితీరు, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న పరిపాలనా చర్యలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. జిల్లా పరిపాలన చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా అధికారులు కమిషనర్‌కు నివేదించారు.