కేంద్రం నిధులిస్తున్నా కొనరా?
- ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం
- యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలి
- అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి
- ఏడేళ్ల ఎంపీ పదవీ కాలంలో కరీంనగర్‌కు రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చాను
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- కరీంనగర్‌లో రూ.1.39 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కరీంనగర్, మే 26 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిధులిస్తున్నా కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తన ఏడేళ్ల ఎంపీ పదవీ కాలంలో కరీంనగర్ అభివృద్ధికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని చెప్పారు.
మంగళవారం కరీంనగర్‌లో రూ.1.39 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నగర పాలక సంస్థ కార్యాలయ భవనంపై రెండవ అంతస్తు, కార్మికుల ఆరోగ్య కేంద్ర భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మతు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫూల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మీడియాతో బండి సంజయ్ మా ట్లాడుతూ.. సుతిలీతాడు మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమేనని అన్నారు. మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందని చెప్పా . అయినా ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజను కొని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పొరపాట్లు జరిగిన చోట గుర్తించి వెంటనే సరి చేసుకుని వడ్లను కొనుగోలు చేయాలన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపే రూ.840 కోట్లు నిధులు తీసుకువచ్చానని తెలిపారు. తన ఏడేళ్ల ఎంపీ పదవీ కాలంలో 20 వేల కోట్లకుపైగా నిధులు తీసుకువచ్చానని, శాతవాహన కాలేజీకి 12బి హోదా, లా కాలేజీ మంజూరు, ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా తెచ్చినని తెలిపారు.
కొందరు అధికారులు యూసీఎఫ్ జాబీతాలో కరీంనగర్ ఉండే అవకాశం లేదని చెప్పారని, అయినా మొండి పట్టుదలతో కేంద్ర పెద్దలను ఒప్పిం చి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్‌ను చే ర్చించానన్నారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపిందని, అందులో కరీంనగర్ ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. డంపింగ్ యార్డు కోసం కూడా 80 కోట్లు విడుదలయ్యాయనన్నారు. గతంలోనూ రూ. 900 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చానని, అమృత్ 1, 2 ద్వారా 277 కోట్లు ఖర్చు చేశామన్నారు.
కరీంనగర్‌కు నిధుల వరద పారి స్తానని, రాష్ట్రంలోనే మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. ఆయా బెటాలియన్లలో పనిచేస్తున్న సౌత్ ఇండియన్స్ పోస్టిం గులన్నీ నార్త్ ఈస్ట్ బెటాలియన్లకే పరిమితం అవుతున్నాయని, తద్వారా వారి కుటుంబాలకు దూరం అవుతున్నారన్నారు.
దీనిని ద్రుష్టిలో ఉంచుకునే ఇక్కడే బెటాలియన్లు ఏ ర్పాటు చేయడానికి క్రుషి చేస్తున్నానన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత అభివ్రుద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాన న్నారు. 50 కోట్ల అర్బన్ డెవలెప్‌మెంట్ ఫండ్‌తో అన్ని డివిజన్లలో రేపటి నుండి అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని, మరో 50 కోట్లు విడుదల కోసం ప్రతిపాదనలు పంపామని బండి సంజయ్ అన్నారు.






