చీరల పంపిణీకి మహిళల “టార్గెట్”...
“100 మంది తీసుకురాకపోతే చర్యలు” అంటూ ఆర్పీలపై ఒత్తిడి..!
అయోమయంలో మహిళా సంఘాలు
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చీరల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలను తరలించాలని ఆర్పీలు, సమాఖ్య సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి సమాఖ్య నుంచి “పక్కాగా 100 మంది మహిళలు హాజరు కావాలి” అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికార ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమం కావడంతో సభను జనాలతో నింపేందుకు అధికారులు దిగివచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలతో పాటు, సభ్యులు కాని వారినీ తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హాజరు తక్కువైతే చర్యలు ”... హాజరు తీసుకుంటాం... తక్కువైతే చర్యలు తీసుకుంటాం...” అంటూ వచ్చిన హెచ్చరికలతో ఆర్పీలు, సమాఖ్య సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో సమాఖ్యకు 100 మంది టార్గెట్ పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను తీసుకురావాలని ఆదేశించడం అధికారుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆయా వార్డులో మహిళలను ఇళ్లకు వెళ్లి బతిమిలాడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారుల మౌఖిక ఆదేశాలతో ఆర్పీల్లో టెన్షన్ ..... వాట్సాప్ సందేశాలు, మౌఖిక ఆదేశాలతో “తప్పనిసరి హాజరు” వాతావరణం సృష్టించారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. హాజరు తక్కువైతే నిజంగానే చర్యలు ఉంటాయా..? అనే భయంతో చాలామంది ఆర్పీలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా రావాల్సింది పోయి, మహిళలను సంఖ్యలుగా మార్చి టార్గెట్లు విధించడం ఎంతవరకు సమంజసం..? అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.






