మహిళ మృతదేహం గుర్తింపు... ప్రియుడిపైనే అనుమానాలు
భర్తను హతమార్చిన ఘటనలో ఇద్దరి హస్తం..!
బిజినేపల్లి మే 28: మండలంలోని ఖానాపూర్, పాలెం గ్రామాల శివారులో మొక్కజొన్న పంట అవశేషాల్లో కాలిపోయి కనిపించిన మహిళ ఖానాపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మగా (50) పోలీసులు బుధవారం గుర్తించారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన భరత్, తన కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న ఆభరణాల ఆధారంగా పార్వతమ్మగా గుర్తించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్సై శంషుద్ధిన్ తెలిపారు.
పార్వతమ్మ హత్యపై అనుమానాలు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతమ్మ అదే గ్రామానికి చెందిన తన ప్రియుడితో కలిసి చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. పార్వతమ్మ తన ప్రియుడితో కలిసి 15 ఏళ్ల కిందట భర్తను హతమార్చిన ఘటనలో కీలక నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేక పోవడంతో కేసును కూడా ఈ మధ్యనే కొట్టి వేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రియుడికి ఈ మధ్య కాలంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, తన కోసమే పార్వతమ్మను హతమార్చి ఉండవచ్చనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతి ఘటనపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.






