25 August, 2026 | 2:58 AM

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

25-08-2026 12:00 AM

ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన..

సికింద్రాబాద్, ఆగస్టు24 (విజయక్రాంతి): మారేడ్పల్లిలోని బృందావన్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గర్భాశయంలోని చిన్న గడ్డ తొలగింపు కోసం వచ్చిన  కాచిగూడ కు చెందిన దివ్య (31) అనే వివాహిత శస్త్రచికిత్స వికటించి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

బాధితుల కథనం ప్రకారం.. గర్భాశయంలో గడ్డకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో దివ్య ఆసుపత్రి లో చేరారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేస్తుండగా, వైద్యుల నిర్లక్ష్యంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్ గీతాంజలి అక్కడి నుంచి పరారయ్యారు. శస్త్రచికిత్స అనంతరం కనీసం కుట్లు కూడా సరిగ్గా వేయలేదని, అనంతరం చికిత్స అందించినా లాభం లేకుండా పోయిందని బాధితులు తెలిపారు.కొన్ని గంటల తర్వాత దివ్య మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఆసుపత్రి యజమాన్యం సరైన సమాధానం చెప్పకపోవడంతో ఫర్నిచర్, అద్దాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం తుకారం గేట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆసుపత్రి యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించాలని, నిర్లక్ష్యానికి కారణమైన వైద్యురాలు గీతాంజలిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి దివ్య సంతానం కలగాలని ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామి ఇచ్చారు.