24 August, 2026 | 1:14 AM

మహిళా ఆవిష్కరణలకు విన్ ఇండియా

24-08-2026 12:20 AM

హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ప్రారంభం

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): మహిళా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ప్రోత్సహించి, వారి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో హెల్త్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్(హెచ్‌ఐఇఎక్స్) ఆధ్వర్యంలో విన్ ఇండియా(ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియా) వేదికను హైదరాబాద్‌లో ఆదివారం ప్రారంభించారు.

హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య రంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారు లు, విధాన నిర్ణేతలు, మీడియా ప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు మొహమ్మద్ అలీ, దర్శకుడు అనుదీప్, యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ టి. దశరధ రామారెడ్డితో పాటు విన్ ఇండియా కోర్ సభ్యులు నవీనా చౌదరి కొయ్యలమూడి, నవనీత్ సింగ్, డాక్టర్ బిజు జాకబ్, వేణు పుతుస్సేరి, కృతి గురజాడ, సూచి గరివాలా, రోజ్ వేజ్ తదితరులు, సుమారు 50 మంది అతిథులు పాల్గొన్నారు.

హెల్త్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్(హెచ్‌ఐఇఎక్స్) సీఈఓ ప్రదీప్ కక్కట్టిల్ మాట్లాడుతూ 2018లో జెనీవాలో ఐక్యరాజ్యసమితి పరిధిలో ప్రారంభమైన హెచ్‌ఐఇఎక్స్, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఆరోగ్య సేవలను అందరికీ చేరువ చేయడానికి పనిచేస్తోందన్నారు. విన్ ఇండియా కోర్ కమిటీ ఆర్గనైజర్ డాక్టర్ పద్మిని మూర్తి మోక్షగుండం మాట్లాడుతూ, మహిళా పారిశ్రామికవేత్తలకు గ్లోబల్ వేదిక కల్పించడమే విన్ ఇండియా లక్ష్యమన్నారు. విన్ ఇండియా కోర్ కమిటీ ఆర్గనైజర్ రష్మీ శర్మ మాట్లాడుతూభారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించి, అభివృద్ధి చెందేందుకు విన్ ఇండియా సహకరిస్తుందని తెలిపారు.