24 August, 2026 | 1:37 PM

మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?

24-08-2026 11:20 AM

కొండా ఫ్యామిలీపై యాక్షన్ తప్పదా?

కొండా మురళికి అపాయింట్ మెంట్ ఇవ్వని భట్టి

ఖర్గేతో భేటీలోనూ కొండాకు దక్కని భరోసా

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో MLAలు, MLCల భేటీ కానున్నారు. విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కుటుంబ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనపై సీఎం రేవంత్ తో నేతలు చర్చించనున్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వివాదంపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. కొండా సురేఖపై చర్యలకే పార్టీ క్రమశిక్షణ కమిటీ మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానని సీఎం సూచించారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంత్రి కొండా సురేఖ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని మంత్రి సురేఖకు ఖర్గే కీలక సూచన చేశారు. దీంతో సురేఖకు ఖర్గే నుంచి కూడా భరోసా దక్కలేదని తెలుస్తోంది. కూతురు సుస్మిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై కొండా సురేఖ ఇప్పటికే రెండు సార్లు వివరణ ఇచ్చారు. కొండా మురళికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై కొండా ఫ్యామిలీపై యాక్షన్ తప్పదా? అన్న చర్చకు బలం ఇచ్చినట్లు అయింది. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సురేఖ వ్యవహారంపై మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టారు.

హద్దులు దాటి మాట్లాడితే క్షమించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్(TPCC President Mahesh Goud) హెచ్చరిస్తూ వస్తున్నారు. పార్టీకి నష్టం  కలిగించే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని సంకేతాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వనపర్తి రాజకీయాలు ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అన్నట్లు సాగుతున్నాయి. కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెడతారా? అన్న ప్రశ్న ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.