24 August, 2026 | 2:13 PM

అనుమతి లేని భవనాలపై సీఎంసీ ఉక్కుపాదం

24-08-2026 12:51 PM

శేరిలింగంపల్లి,ఆగస్టు 24(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అక్రమ నిర్మాణాలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి కూల్చివేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో ఏడు మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలను ముందుగా గుర్తించనున్నారు. చిన్న స్థలాల్లో పరిమితికి మించి అంతస్తులు నిర్మించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాటిపై కఠినంగా వ్యవహరించాలని (సిఎంసి) కమిషనర్ శ్రీజన సూచించారు. అదేవిధంగా 75 చదరపు గజాలకు పైగా ఉన్న స్థలాల్లో భవన నిర్మాణ అనుమతి లేకుండా చేపడుతున్న ఏ నిర్మాణాలైనా చర్యల పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భవనం ఎత్తు కాకుండా అనుమతి ఉందా లేదా అనేది ప్రధాన ప్రమాణంగా పరిగణిస్తారు. గుర్తించిన వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా కూల్చివేతలు చేపట్టాలని ఆదేశాలు ఉన్నాయి.

పౌరుల ఫిర్యాదులపై మాత్రమే స్పందించే పద్ధతికి స్వస్తి పలకాలని కమిషనర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా గుర్తించిన నిర్మాణాలపైనా ఎలాంటి తేడా లేకుండా చర్యలు తీసుకోవాలని, సమాచారం ఎక్కడి నుంచి వచ్చినా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు.ప్రెస్‌నోట్ విడుదలైన రోజు నుంచి ప్రతిరోజూ కూల్చివేతల సంఖ్యను కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తారు.నిర్మాణాలు ప్రారంభ దశలోనే అక్రమాలను గుర్తించి వేగంగా, సమర్థంగా చర్యలు చేపట్టాలని సూచనలు ఉన్నాయి.అయితే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో చిన్న నిర్మాణదారులపైనే దృష్టి సారించకుండా, భారీ అక్రమ నిర్మాణాలు, వాణిజ్య భవనాలు, రాజకీయ లేదా ఆర్థిక పలుకుబడి ఉన్నవారిపైనా ఒకే విధంగా చట్టం అమలు కావాలని ప్రజలు కోరుతున్నారు. కూల్చివేతల్లో పారదర్శకత పాటించి, తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచితేనే ఈ డ్రైవ్‌పై విశ్వాసం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.