21 March, 2026 | 12:55 AM

ఐరాస ఎవరిపక్షం?

18-03-2026 12:00 AM

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి ఇటీవల ఆమోదించిన తీర్మానం 2817, ఆ సంస్థ వైఫల్యాలకు నిలువుటద్దంగా నిలుస్తున్నది. ఈ తీర్మానం ఇరాన్ ప్రతీకార చర్యలను తీవ్రంగా ఖండించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్, అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఒమన్ మధ్యవర్తి మహమ్మద్ అల్-హసన్ సిద్ధం చేసిన ఒక చారిత్రక ఒప్పందాన్ని తీర్మానం విస్మరించింది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని పాఠశాలలు, పౌర నివాసాలపై అమెరికా జరిపిన దాడులను విమర్శించకుండా, క్షిపణి దాడుల వల్ల కలిగిన ప్రాణనష్టాన్ని చాటిచెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం తీర్మానంలోని ప్రధాన వైఫల్యం. ఇరాన్ ప్రతీకార చర్యలను ఖండించడంలో ఐరాస చూపిన శ్రద్ధ, ఆ వివాదానికి మూల కారణాలను అన్వేషించడంలో మాత్రం చూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సుమారు 135 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపినప్పటికీ, ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐరాస నామమాత్రపు వేదికగానే మిగిలిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌర హక్కుల నేతలు విమర్శిస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రపంచం ఒక దారుణమైన సైనిక దాడిని చూసింది. దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకునే దశలో ఉన్న ఇరాన్‌పై ఈ దాడి జరిగింది. ఒమన్ మధ్యవర్తి మహమ్మద్ అల్-హసన్ మాటల ప్రకారం.. ‘ఇరాన్, అమెరికా మధ్య శాంతినెలకొల్పేందుకు మేం ఎంతో కృషి చేశాం. దౌత్యం ద్వారా రెండు దేశాల మధ్య కుదురుతుందని ఆశించాం.

ఆ ఒప్పందం కుదిర్చేందుకు, ఎంతో ముందుకెళ్లాం. ఇక రేపు ఒప్పందం జరగుతుంది.. భావించిన తరుణంలో ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది’ అంటూ తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ వేదికపై వాపోయారు. ఏదేమైనా, ఆ దాడులే చివరకు పశ్చిమాసియాలో అగ్గిరాజేసిందనేది వాస్తవం. ఇరాన్ సరిహద్దుల చుట్టూ ఇప్పుడు అమెరికన్ సైనిక స్థావరాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

ఇవి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసిన స్థావరాలు కావు. అగ్రరాజ్య ఆధిపత్య కాంక్షకు అవి నిదర్శనాలు. గ్రీన్‌లాండ్ నుంచి పనామా కాలువ వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్ ప్రపంచ దేశాల సార్వభౌమత్వానికే ముప్పు. ట్రంప్ తనకు తాను శాంతి కాముకుడినని చెప్పుకొంటున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఆయన శాంతికాముకుడైతే గాజాలో వేల సంఖ్యలో మరణాలు ఎందుకు సంభవించాయి? వెనిజులాలో చోటుచేసుకున్న చమురు రాజకీయాలకు ఆయన ఏం సమాధానం చెప్తారు? వీటన్నింటినీ చూసి, ట్రంప్ శాంతి కాముకుడు.. అని చెప్పగలమా? లేదు. ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఓ పాఠశాలలపై పడిన అమెరికా టోమాహాక్ క్షిపణులు వందలాది మంది అమాయక చిన్నారుల ప్రాణాలు తీశాయి.

ఈ దారుణాన్ని అగ్రరాజ్యం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి ఏకపక్ష ధోరణులను సమర్థించే దేశాలు కూడా చరిత్రలో దోషులుగా నిలబడక తప్పదు. నేడు అంతర్జాతీయ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం అమెరికా అధ్యక్షుడి దూకుడును అడ్డుకోవడం. ఇజ్రాయెల్‌తో కలిసి సాగిస్తున్న ఈ యుద్ధ తంత్రాన్ని నిలువరించాల్సిందే. అందుకు.. ఐరాసనే పూనుకోవాలి. యుద్ధం జరగడానికి గల మూలాలను పరిష్కరించకుండా, ఐరాస పర్యావసానాల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఐరాస తన ధోరణిని మార్చుకోకపోతే, ఆ సంస్థ కేవలం ఒక గతకాలపు జ్ఞాపకంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.