27 May, 2026 | 2:21 AM

సీఎన్జీ ధరలు నాలుగోసారి పెంపు

27-05-2026 01:27 AM
  1. కిలోకు రూ.2 చొప్పున పెరుగుదల
  2. 11 రోజుల వ్యవధిలో రూ.6 వడ్డన
  3. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ధర రూ.83.09
  4. హైదరాబాద్‌లో ధరలు స్థిరం
  5. కొద్దినెలలుగా రూ.97 కొనసాగుతున్న ధర
  6. రేపో మాపో రూ.100 మార్క్ దాటే అవకాశం

న్యూఢిల్లీ, మే ౨౬: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు మరోసారి పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి మేరకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) నాలుగోసారి ధర పెం చింది. ఇప్పటికే మూడుసార్లు కలిపి కిలోకు రూ.4 మేర పెంచిన కంపెనీ మంగళవారం మరో రూ.౨ పెంచింది. ఉదాహరణకు ఈ నెల 15 కంటే ముందు ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.77.09 ఉండేది. ౧౫న కిలోకు రూ.౨ చొప్పున ధర పెరిగింది. దీంతో ధర రూ. 79.09కి చేరింది. రెండోసారి పెంపు 17న రూపాయి పెరిగింది.

దీంతో ధర రూ. 80.09కి చేరింది. మూడోసారి ౨౩న మరో రూపాయి పెరిగి, ధర రూ.81.09కి చేరింది. తాజాగా నాలుగోసారి రూ.౨ చొప్పున పెరిగి ధర ఇప్పుడు రూ.83.09కు చేరుకున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హో ర్ముజ్ జలసంధి మూసివేత, రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ సంక్షోభం కారణంగానే ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ ప్రకటించింది. గల్ఫ్ నుంచి సీఎన్జీ రవాణా నిలిచిపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కంపెనీ దిగుమతి తీసుకుంటుండటంతో రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో అనివార్యంగా ధర పెంచాల్సి వస్తున్నదని స్పష్టం చేసింది. మరోవైపు, పెరిగిన ధరల ప్రభావం ఆటో, క్యాబ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది.

తెలంగాణలో స్థిరంగా ధరలు

దేశీయంగా సీఎన్జీ ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ, తెలంగాణపై ఆ ప్రభా వం కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటివరకు సీఎన్జీ ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. కొన్ని నెలల నుంచి ఇక్కడ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తు తం కిలో సీఎన్జీ ధర రూ.97 పలుకుతున్నది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆ ధర రూ.95 అమలవుతున్నది. స్థానిక పన్నుల్లో మార్పు లేకపోవడం, రవాణా ఖర్చుల్లో మార్పులు లేకపోవడంతోనే రాష్ట్రంలో ధరలు స్థిరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే.. రేపో మాపో ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అతి త్వరలోనే ధర రూ.౧౦౦ మార్క్ దాట వచ్చని అంచనా వేస్తున్నారు.