27 May, 2026 | 2:21 AM

అన్నదాత ఆక్రోషం..

27-05-2026 01:23 AM

రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

ఎండకు, ఎండి వానకు తడిసిన నాయకుల్లో,అధికారుల్లో,చలనం లేదు

రహదారిపై ధాన్యం బస్తాలను తగలబెట్టి ధర్నా

ఎల్లారెడ్డి, మే 26 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రహదారిపై ధాన్యం బస్తాలను తగలబెట్టి ధర్నాకు దిగారు.

కాంటాలు పూర్తయి నెల కావస్తున్నా..

కొనుగోలు కేంద్రంలో కాంటాలు పూర్తయి దాదాపు నెల కావస్తున్నా లారీల రాకపోవడంతో ధాన్యం (paddy procurement) ఎక్కడికక్కడే పడి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించడం కంటే విక్రయించడమే కష్టంగా మారిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఒకపక్క వర్షాలు కురుస్తుండటంతో ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసి ముద్ద అవుతోందని, దానిని మళ్లీ ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోందని వాపోయారు. అటు లారీలు రాక ధాన్యం తరలకపోవడంతో కేంద్రం వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు, తరలించేందుకు అదనంగా డబ్బులు ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన చెందారు.

స్తంభించిన ట్రాఫిక్..

రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ప్రేమ్ కుమార్, ఎస్త్స్ర రాజు(Yellareddy Police), రెవెన్యూ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. వారం రోజుల్లోగా ఉన్న ధాన్యం మొత్తాన్ని తరలించేలా చర్యలు తీసుకుంటామని, వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేరవేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తహశీల్దార్ హామీతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి లారీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో  ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.