27 May, 2026 | 2:21 AM

ఇరాన్‌పై వైమానిక దాడులు

27-05-2026 01:23 AM
  1. సుదీర్ఘ సమయం తర్వాత మళ్లీ అమెరికా విజృంభణ
  2. క్షిపణి స్థావరాలు, సముద్ర జలాల్లోని మైన్లు టార్గెట్
  3. ఖతార్ వేదికగా చర్చలు జరుతుండగా దాడులేంటి?: ఇరాన్

టెహ్రాన్/ వాషింగ్టన్, మే ౨౬: అమెరికన్ సైన్యం దక్షిణ ఇరాన్‌పై మంగళవారం వైమానిక దాడులకు పాల్పడింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించింది. సముద్రంలో మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్లను ధ్వంసం చేసింది. వరుస దాడులతో హోర్ముజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం, హోర్ముజ్‌గాన్ తీర ప్రాంతం ఉలిక్కిపడింది. బందర్ అబ్బాస్ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

దాడులను అమె రికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ధ్రువీకరించింది. అమెరికన్ బలగాల రక్షణ కోస మే దాడులకు దిగినట్లు తేల్చిచెప్పింది. మరోవైపు, అమెరికన్ వైమానిక దాడులను ప్రతి ఘటించే క్రమంలో ఇరాన్ సైన్యం ఓ అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామి క్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. అనేక యూఎస్ యుద్ధ విమానాలపైనా కాల్పులు జరిపామని వెల్లడించింది.

ఖతార్ వేదికగా ఒకవైపు ఇరుదేశా ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ అమెరికా ఇలాంటి చొరబాట్లకు పాల్పడటం ఏంటని నిలదీసింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని మండిపడింది. అమెరికా దురహంకారానికి తగిన బదులిస్తామని హెచ్చరించింది. ఇంత జరుగుతున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ‘ఇరాన్‌తో శాంతి చర్చలు సజావుగానే సాగుతున్నాయి’ అని పేర్కొనడం గమనార్హం.