28 February, 2026 | 7:58 AM

విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఏరి?

28-02-2026 01:13 AM
  1. పీహెచ్‌డీలు, సబ్జెక్ట్ నిష్ణాతులు ఒక్కరైనా ఉన్నారా?

సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఎక్కడ ఉన్నారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై హరీశ్‌రావు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు విద్యావేత్తలే లేని కమిటీని వేసి, వారితో విద్యావిధానంపై నివేదిక ఇప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ విద్యా కమిషన్‌లో స్కూల్ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు మినహా.. అసలు ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్లు కానీ, స్కూల్ సిలబస్ తయారీలో, కోర్ సైన్స్ సబ్జెక్టుల్లో పట్టున్న వాళ్లు కానీ ఈ కమిటీలో ఒక్క రైనా ఉన్నారా అని నిలదీశారు.

ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. ఒక ఇం జనీర్ అని, పరిపాలనలో అనుభవం ఉన్నం త మాత్రాన.. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా అని ప్రశ్నించారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ఉదాహరణ అని మండిపడ్డారు. కొత్త విద్యావిధానం విషయంలో.. తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పారదర్శకతను కోరుకుంటున్నారని తెలిపారు.

గడిచిన రెండేండ్లు గా విద్యాశాఖను గాలికి వదిలేసి, సబ్జెక్ట్ తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించ కుండా, సంబంధం లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. మీరు వేసిన కమిటీ ఇంత గొప్పగా ఉంటే, వారిచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతున్నదన్నారు.