5 March, 2026 | 3:44 AM

వేం కే టికెట్

05-03-2026 01:41 AM
  1. రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్
  2. నేడు నామినేషన్లు

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ అభ్యర్థులను ఖరారు చేసింది. కొన్ని రోజులుగా తర్జన భర్జన చేసిన పార్టీ నేత లు రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేర్లను ప్రకటించింది. ఈ ఇద్దరు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నా రు.   

అభ్యర్థుల ఎంపికపై బుధవారం పార్టీ నేతలు జూమ్ సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ  సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు సీనియర్ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. రాజ్యసభ సీటు కోసం చాలా మంది ఆశించినా..

చివరకు సీఎం రేవంత్‌రెడ్డి స్నేహితుడైన వేం నరేందర్‌రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్న అభిషేక్ మను సింఘ్వి పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న అభిషేక్‌మను సింఘ్వికి రాజ్యసభ సీటును రెన్యూవల్ చేసింది. ఇక రెండో సీటు కోసం దాదా పు 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 16 మంది పేర్లను పీసీసీ జాబితాగా పంపించగా.. చివరకు సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వేం నరేందర్‌రెడ్డి వైపే పార్టీ అధిష్ఠా నం మొగ్గుచూపింది. మొదటగా ఇండి యా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు బలంగా వినిపించింది. సుదర్శన్‌రెడ్డి రాజ్యసభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదని కాంగ్రెస్‌వర్గాలు తెలిపాయి.

పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా రాజ్యసభ సీటును ఆశించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి,  మాజీ మంత్రులు  చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, రైతు కమిషన్ చైర్మన్ కోదం డరెడ్డి, ఎస్సీల నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసిం హులు,

పార్టీ నేత దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ సామాజికవర్గం నుంచి బెల్లయ్యనాయక్ తదితరులు టికెట్ ఆశించారు. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే ఈ రెండు రాజ్యసభ స్థానాలకు ఈనెల 16న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

సామాజిక న్యాయం ఏదీ? 

కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి ఐకాన్ అంటూ ప్రచారం చేసుకునే ఆ పార్టీ నేతలు.. రాష్టంలో రెండు రాజ్యసభ స్థానాల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనివ్వలేదనే విమర్శలు  వినిపిస్తున్నాయి. ఓసీ వర్గానికి చెందిన అభిషేక్‌మను సింఘ్వి అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రెండో సీటు కూడా ఓసీ వర్గానికి చెందిన వేం నరేందర్‌రెడ్డికి కట్టబెట్టడంపైన రాజకీయవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక సీటు ఓసీలకు ఇచ్చినందున.. రెండో సీటు బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని ఆయా సామాజికవర్గాల నేతలు, కులసంఘాలు కాంగ్రెస్ పార్టీని కోరాయి.

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అవేమి పట్టించుకోలేదు. బీసీల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, పీసీసీ ఇంటలెక్చువల్ చైర్మన్ అనంతుల శ్యామ్‌మోహన్ తదితరులు రాజ్యసభ సీటును ఆశించిన విషయం తెలిసిందే. ఎస్సీల్లోని మాదిగలకు రాజ్యసభకు అవకాశమివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.