20 July, 2026 | 8:30 PM

మత్స్యకారులకేదీ బతుకు భరోసా?

20-07-2026 02:13 AM

ముగిసిన ప్రమాద బీమా దరఖాస్తు గడువు

  1. పునరుద్ధరించని  ప్రభుత్వం
  2.   4.20 లక్షల కుటుంబాల్లో ఆందోళన
  3. రాష్ట్ర వాటా ప్రీమియం  చెల్లింపులో జాప్యం
  4. నిలిచిపోయిన కేంద్రం వాటా
  5. జాలర్లకు భద్రత కవచం దూరమవుతుందా?

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : చేపలవేటని నమ్ముకొని జీవించే మత్స్యకార కుటుంబాలకు ఆప ద సమయంలో అండగా నిలిచే ప్రమాద బీమా గందరగోళంలో పడింది. బీమా గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా పునరుద్ధరణకు నోచుకోకపోవ డంతో 4.20లక్ష మంది మత్స్యకార సభ్యుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన వేళ ఆసరాగా నిలిచే ఈ బీమా కవ చం దూరమవుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.

రాష్ట్రంలో 6వేల మత్స్యకార సొసైటీలు ఉండగా, దాదాపు 4.20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల్లోని సభ్యులకు ప్రమాదం జరిగిన ప్పుడు వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయు క్తంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించా యి. రూ.5 లక్షల బీమాకు గాను ఒక్కో సభ్యుడి పేరున రూ. 91చొప్పున 4.20 లక్షల మందికి రూ.3.82 లక్షలకు వరకు ఏటా చెల్లిస్తుంటాయి. ఇందులో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుంది.

అంటే రాష్ట్రం తన వాటా సుమారు రూ. 1 కోటి 52 లక్షల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు చెల్లించకపోవడంతో కేంద్రం కూడా విడుదల చేయడం లేదు. ఏదైనా ప్రమాదంలో సభ్యుడు మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.2.50 లక్షలు, వైద్య ఖర్చులకు రూ.25 వేలు ఇస్తారు. అయితే బీమా గడువు ముగిసినా రెన్యూవల్ చేయకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

బీమా గడువు ముగిసినందున ఎవరైనా మరణించినా ప్రమాద బీమా వర్తించదని, బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదారుగురు మత్స్యకార్మికులు చనిపోయారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకార సభ్యుడికి అదనంగా రూ.4 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. 

19 రోజులే గడువు

మత్స్యకార్మికుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 19 రోజులే గడువు విధించారు. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు, ఆ తరువాత కార్యక్రమాలు ముగిసే వరకు కనీసం 12 రోజుల సమయం పడుతుంది. దరఖాస్తుకు డెత్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఈ 19 రోజుల వ్యవధిలో కార్యాలయాల నుంచి సర్టిఫికెట్స్ చేతికందే అవకాశం తక్కువగా ఉంటుంది. సర్టిఫికెట్ వచ్చినా దరఖాస్తులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు కూడా లేకపోవడంతో చాలా కుటుంబాలు బీమా కోల్పోతున్నాయి.  తమ సమస్యలు చెప్పుకోవడానికి సుదూర  వచ్చే మత్స్యకారులకు రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయం (మత్స్యభవన్) ప్రహసనంగా మారింది. 4.20  లక్షల మంది ప్రయోజనాలను కాపాడాల్సిన శాఖ..  వారి గోడు వినడానికి కూడా సిద్ధంగా లేదు.  కార్యాలయంలో కనీసం  హెల్ప్ డెస్క్, ఫోన్ నంబర్ కూడా అందుబాటులో లేవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.

ఫిర్యాదు చేసేదెలా?

సొసైటీల రిజిస్ట్రేషన్లు, అంతర్గత వివాదాలు, సభ్యత్వాల గొడవలు, చెరువుల లైసెన్సులు, ప్రభుత్వ పథకాల అమలు, పథకాల రాయితీల్లో అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు నిత్యం వందలాది మంది లబ్ధిదారులు మాసబ్ ట్యాంక్ సమీపంలోని మత్స్యశాఖ భవన్ కు వస్తుంటారు. కానీ, వారికి నిరాశే ఎదురవుతోంది. ఏ అధికారి కలవాలో తెలియడం లేదని, కనీస సమాచారం ఇచ్చే వారు లేరని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు.