న్యాయం చేయమంటే దాడులు చేస్తున్నారు
సరిహద్దు రైతులు, పెద్దమనుషులు దౌర్జన్యం
పంచాయతీకి అని పిలిచి దాడి చేశారు
బాధితుడు నెల్లూరి రామ కృష్ణ ఆవేదన
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో గల రాజేశ్వరపురం గ్రామానికి చెందిన నెల్లూరీ రామకృష్ణ - వాణి దంపతులకు సంబంధించి రాజేశ్వరపురం రెవిన్యూ గ్రామంలో 346 సర్వే నంబర్ నందు 5 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి కలదు. 346, 347, 378, 379 సర్వే నెంబర్లకు సంబంధించి సర్వే నిర్వహించి ఉమ్మడి సరిహద్దు రాయినీ సర్వే ద్వారా పాతించారు. మరుసటి రోజు అనగా 31/12/2025న పై సర్వే నంబర్లలో గల 378, 379 సర్వే నెంబర్లకు చెందిన రైతులు సర్వే చేసి పాతిన ఉమ్మడి సరిహద్దు రాయిని అక్రమంగా తొలగించారు.
దీనిపైన నేను అనగా నెల్లూరి వాణి ఈ సమస్యపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నందు అక్రమంగా రాయి పీకిన నలుగురిపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు విచారణ చేసి ది. 26/03/2026న ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అక్రమంగా పీకిన సరిహద్దు రాయిని మళ్లీ ఏర్పాటు చేయించాల్సిందిగా పోలీసు వారిని కోరగా పోలీస్ శాఖకు సంబంధం లేదు రెవిన్యూ వారిని సంప్రదించాలని సూచించారు. 06.04.3026 రోజున నేలకొండపల్లి ఎస్సై సంతోష్ మా సరిహద్దు రాయి సమస్యను పరిష్కరిస్తానని తెలిపి చేను వద్దకు ఇద్దరు పెద్దమనుషులను తీసుకొని రమ్మన్నారు.
అక్కడకు వెళ్లిన తర్వాత ఎడి ఖమ్మం నిర్వహించిన సర్వేకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలానికి చెందిన డొంక ప్రదేశాన్ని ఆక్రమించుకున్న రైతుకు మేలు జరిగేలా.. నాకు అన్యాయం చేసేలా.. నా వ్యవసాయ భూములోనే గల పొలం స్థలాన్ని దారికి ఇవ్వమని ఇబ్బంది పెట్టారు.ఈ విషయాన్ని మేము వ్యతిరేకించాం.. మా భూమి మేము ఎందుకు ఇస్తాము.. ఇది మా సొంత భూమి అని ఎస్ఐకి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం. ఈరోజు అనగా ది. 7/4/2026న మంగళవారం రోజున ప్రభుత్వ డొంక ప్రదేశాన్ని ఆక్రమించిన యలముడి శేఖర్ (సర్వేనెంబర్ 379), పోలంపల్లి ఉపేందర్ (సర్వేనెంబర్ 378), వీరికి అనుకూలంగా ఉన్న పెద్దమనుషులలో జటామ్గి వెంకన్న మళ్లీ ఈరోజు పంచాయతీకి రావాలని స్థానిక పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ దండా రంగయ్య సమక్షంలో పిలిపించారు.
ఈ విషయంపై నేను, నా భార్య ఇద్దరం కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాం. ఎడి ఖమ్మం సర్వే ప్రకారం కుదరదు, అది తప్పు అని వారే సొంతంగా నిర్ణయిస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేలా నీ వ్యవసాయ భూమికి ఎలా వెళ్తావు నీ సంగతి చూస్తా నీ అంత చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడి మాపై (నేను, నా భార్య) దాడులు చేశారు. మా కుటుంబంలో నేను, మా నాన్న, మా తమ్ముడు వికలాంగులం అవ్వడంతో సమాజంలో వెనుకబడి ఉండడం చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఒంటరిగా రమ్మని చెప్పడంతో నేను నా భార్యని తీసుకొని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్లేసరికి అవతల వైపు వ్యక్తులకు సంబంధించి 30 మంది దాకా వత్తాసుగా వచ్చారు.
వీరందరూ కలిసి మమ్మల్ని బలవంతంగా ఒప్పందానికి ఒప్పుకోవాలి అంటూ అసభ్యకరమైన పదజాలం వాడుతూ నన్ను, నా భార్యను కొడుతూ ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశారు. నన్ను చంపుతాను అంటూ బెదిరింపులకు పాల్పడుతూ మీది మీదికి వచ్చారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఎడి ఖమ్మం నిర్వహించిన సర్వే ప్రకారంగా క్షేత్రస్థాయిలో ఉండేలా చూస్తూ మాపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మాకు వీరందరినీ నుంచి ప్రాణహాని ఉందని, వెంటనే మాకు ప్రాణ రక్షణ కల్పించాలని మీడియా ద్వారా కోరుతున్నామన్నారు.




