7 April, 2026 | 9:57 PM

జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

07-04-2026 07:57 PM

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి డబ్ల్యూజేఐ వినతి

ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ

ఖమ్మం,(విజయ క్రాంతి): కరోనా సమయంలో నిలిపి వేసిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీలను (రైల్యే కన్సెషన్) పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా ప్రతినిధులు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన జర్నలిస్టుల రైల్వే పాసుల సమస్య తన దృష్టిలో వుందన్నారు. ఖచ్చితంగా సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్ రావు), ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, జిల్లా కోకన్వీనర్లు అమరనేని రామకృష్ణ, నాగరాజు దేవర, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె.కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు బొడ్డుపల్లి రవీందర్ తదితరులు కేంద్రం రైల్వే ప్రయాణ రాయితీ పాసులను పునరుద్ధరించక పోవడం వల్ల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీలను కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసిందని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చక్కబడి, రైల్వే సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ, జర్నలిస్టులకు ఇచ్చే రాయితీలను మాత్రం ఇంకా పునరుద్ధరించ లేదని ఎంపీ రఘురాం రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా గతంలో రాయితీలను పునరుద్ధరించాలని సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు నిరంతరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ మరియు జిల్లా స్థాయి జర్నలిస్టులకు ఈ రాయితీ ఎంతో ఆర్థిక భరోసానిచ్చేదని, పాసులు నిలిపి వేయడం వల్ల జర్నలిస్టులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఎంపీ రఘురాం రెడ్డికి తెలిపారు.