23 May, 2026 | 2:38 AM

రైతుకు రికామేదీ?

23-05-2026 01:29 AM

తీరిక లేకుండా వ్యవసాయ పనులు 

మహబూబాబాద్, మే 22 (విజయక్రాంతి): రైతుకు.. గత రెండు వ్యవసాయ సీజన్లలో రికాం లేకుండా పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత వాన కాలంలో సాగు చేసిన పంటల దిగుబడులు రాగానే, సమృద్ధిగా నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం ఉండడంతో యాసంగి పంటల సాగు కూడా వానాకాలంతో తగ్గకుండా చేపట్టారు. దీనితో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను యాసంగి సీజన్లో కూడా సాగు చేయడం జరిగింది. దీనితో అటు వానాకాలంలో పూర్తిస్థాయిలో సాగులో నిమగ్నమైన రైతులు, యాసంగిలో కూడా ఏమాత్రం ఖాళీగా ఉండకుండా వ్యవసాయ పనులు నిర్వహించారు.

రైతులకు కృషి వల్ల ఆ మేరకు యాసంగి సీజన్లో ఆశించిన పంటల దిగుబడి కూడా గణనీయంగా వచ్చింది. ఒకేసారి మొక్కజొన్న, వరి పంట దిగుబడులు చేతికి రావడం, ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం, పండించిన మొక్కజొన్న పంటకు ప్రైవేటు మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో ప్రభుత్వమే మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో రైతులు పూర్తిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి మొగ్గుచూపుతున్నారు. దీనితో యాసంగి పంటల దిగుబడులు దాదాపు 70 నుండి 90 శాతం వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలివస్తుంది. ఫలితంగా రైతులు నెలన్నరకు పైగా తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.

మళ్లీ మొదలైన పనులు

గత ఏడాది యాసంగిలో పండించిన పంట ఉత్పత్తుల అమ్మకాలను ఓవైపు ముమ్మరం చేస్తూనే, మరోవైపు వచ్చే వానాకాలం పంటల సాగుకు రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. కొందరైతే యా సంగిలో పండించిన దాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తుల దిగుబడులను పొలంలోనే ఓవైపు నిలువ చేసి, భూమిని కలియ దున్నుతున్నారు. ఇంకొన్ని చోట్ల వాన కాలంలో సాగుచేసిన పంట దిగుబడుల చివరి ఉత్పత్తులను సేకరించే పనిలో ఉన్నారు.

మరోవై పు వచ్చే వానకాలం పంటల సాగుకు ముమ్మరంగా రైతులు దుక్కులు దున్నే పనులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మార్చి నెలలో యాసంగి పంటల సాగు పనులు పూర్తి చేసి, ఏప్రిల్, మే నెలలో తీర్థయాత్రలు, వివాహాది శుభకార్యాలు, ఇతర పనులు చక్కబెట్టుకునే పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఆ పనులను పూర్తిగా పక్కనబెట్టి, వ్యవసాయానికే సమయాన్ని వెచ్చించి, తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదును పోతే కష్టం కదా అంటూ అనేకమంది కర్షకులు వచ్చే వానకాలం సాగుకు శ్రీకారం చుడుతున్నారు.