22 April, 2026 | 3:06 AM

హెచ్‌సీఏలో సీఎంవో జోక్యమేంటి?

22-04-2026 01:24 AM

సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారు

టీసీఏ తీవ్ర ఆరోపణలు

సికింద్రాబాద్, ఏప్రిల్ 21: సికింద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో పాలన అస్తవ్యస్థంగా ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌సీఏ వ్యవహారాల్లో సీఎం పేరు పదేపదే వినిపిస్తుండడం పలు అనుమానాలు నెలకొన్నాయని ఆరోపించింది.

హెచ్‌సీఏ పాలనా వ్యవహరాలాల్లో సీఎం/సీఏంవో బ్యాక్‌డోర్ పద్ధతుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుందో చెప్పాలని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సెక్రటరీ శేష్ నారాయణ్, మాజీ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లేవనెత్తిన పలు అంశాలను గతంలోనే టీసీఏ వెలుగులోకి తెచ్చిందన్నారు.

సీఎం ఆదేశాల మేరకే జీవన్‌రెడ్డిని హెచ్‌సీఏ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని మాజీ కార్యదర్శి ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఎం పేరు ఉపయోగిస్తున్నారా లేక దుర్వినియోగం చేస్తున్నారా అన్నది తేల్చాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. హెచ్‌సీఏపై ఉన్న కేసులకు సంబంధించి సీఐడీ దర్యాప్తుకు ఎందుకు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పూర్తి ఆధారాలతో టీసీఏ పలుసార్లు ఫిర్యాదులు చేసినా వాటిపై దర్యాప్తుకు సంబంధించి పురోగతి లేదన్నారు.

ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేలా నివేదిక కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అవినీతిపరులను ఎందుకు కాపాడుతున్నారని గురువారెడ్డి ప్రశ్నించారు. అసలు హెచ్‌సీఏపై కేసులే లేవంటూ కొందరు అధికారులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. హెచ్‌సీఏపై వివిధ ఆరోపణలతో హైకోర్టులు, సుప్రీంకోర్టులో కలిపి దాదాపు 20కి పైగా కేసులు కొనసాగుతున్నాయని గురువారెడ్డి గుర్తు చేశారు. టీసీఏతో కలిసి పనిచేయాలని బీసీసీఐ చెప్పినా ఆ ఆదేశాలను హెచ్‌సీఏ లెక్క చేయడం లేదని మండిపడ్డారు. హెచ్‌సీఏలోని అక్రమాలపై స్వతంత్య్ర సంస్థల ద్వారా విచారణ జరపాలని టీసీఏ డిమాండ్ చేసింది.