సంక్షోభాల సమయంలో ఉత్తమ మార్గమేది?
దేశవిహారః కర్మశ్రమ
పదార్థమల్పం భక్షయతి
భక్షయిత్వా చ భూయః
కర్మసు యోగం యఛ్ఛతి
రాజ విహారస్తు స్వయం
వల్లభైశ్చ స్వయంగ్రాహ
ప్రణయ పణ్యాగార
కార్యోపగ్రహైః పీడయతీతి
(కౌటిలీయం 8 4) దేశవిహార (దేశంలోని ప్రజలు సుఖాసక్తులై ఉండడం) రాజవిహారాల (రాజు సుఖానుభవ ఆసక్తుడై ఉండడం) మ ధ్య భేదం ఉన్నది. ప్రజలు పనులు చేసిచేసి కలిగిన శ్రమను తొలగించుకోవడానికి కొం చెం ధనాన్ని, కాలాన్ని వ్యయించి.. తదుపరి తమతమ పనులలో లగ్నమౌతారు. పనికి పనికి మధ్య విశ్రాంతి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
రాజు స్వ యంగా ఇష్టులైన బంధు మిత్రులతో కూడి ధనాన్ని , కాలాన్ని వ్యయిస్తూ.. ప్రజలనూ పీ డించి ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరించ డం చేత పణ్యాగారాలలో అనగా కోశాగారాలలో జరిగే లావాదేవీల మీద పట్టును కోల్పోతాడు.. కోశాగారాధికారులు లంచాలకు అలవడి దేశాన్ని పీడిస్తారు, అంటాడు, ఆచార్య చాణక్య. అగ్నివల్ల ఒక గ్రామం పూర్తిగా..
లేదా కొంతభాగమే కాలిపోవచ్చును కాని వరదల లాంటివి వచ్చినప్పుడు వందలాది గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. నిజానికి ప్రమాదం చిన్నదైనా పెద్దదయినా ప్రమాదమే. దానిని నివారించవల సినదే. అయితే మన చేతులలో లేని సమయంలో ప్రమాద తీవ్రతను అరికట్టేందుకు లేదా తగ్గించేందుకు ప్రయత్నించాలి.
నలిగేది ప్రజలే
ప్రజలలో కలహాలు వస్తే.. ప్రజలలో ము ఖ్యులతో,పెద్దలతో మాట్లాడి సామదానభేద దండోపాయాల చేత వారిని వశం చేసుకొనడం ద్వారా, కలహ కారణాలను తొలగించ డం ద్వారా వారి వివాదాలను పరిష్కరించవచ్చు. అంతేకాదు, ప్రజల పరస్పర వైరం ఒ క్కొక్కసారి పాలకులకు ఉపకరిస్తుంది. అదే రాజ కుటుంబాల మధ్య కలహాలు వస్తే అది ప్రజలను పీడిస్తుంది. ప్రజలు అడకత్తెరలో పోకచెక్కలుగా నలిగిపోతారు.
వారి మధ్య వైరుధ్యాలను తొలగించాలి అంటే రెట్టింపు ప్రయత్నం అవసరం అంటాడు చాణక్య. అలాగే తన సైన్యంలో తిరుగుబాటు వస్తే.. ముఖ్యులైన నాయకులను అనుకూలం చే సుకోవడం ద్వారా తిరుగుబాటును అణిచివేయడం సాధ్యపడుతుంది. శత్రుసైన్యం వల్ల ప్రమాదం వస్తే వారు లూటీలు, చంపడాలు, కాల్చడాలు, మనుషులను అపహరిం చడం లాంటి కార్యాల ద్వారా సమస్త దేశా న్నీ పీడిస్తారు.
కాబట్టి అప్రమత్తంగా ఉండా లి. ఆడంబరాల జీవితం.. పంచుకోవాల్సిన సంపదను పెంచుకునేందుకు మార్గాలు వె తుకుతుంది.. ఆధిపత్యాన్ని చూపేందుకు, అహంభావాన్ని ప్రదర్శించేందుకు ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా పాలకులను ప్రజలకు దూరం చేస్తుంది. ప్రజలలో అసంతృప్తిని పెంచి తిరుగుబాటుకు దారితీస్తుంది. అవసరానికి మించిన అనుభవాలు విషంతో సమానమే.. అవి వ్యసనాలుగా మారుతాయి.
నాయకుని దార్శనికత ముఖ్యం
చరిత్రలో నూరో చక్రవర్తి రాజకోశాన్ని పూర్తిగా పెద్దపెద్ద భవనాల నిర్మాణానికి, విందులు విహారాలకు, తన వ్యక్తిగత సంతోషానికి వినియోగించాడు. రోమ్ నగరం కాలి పోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడు. ప్రమాదాలు చెప్పిరావు. అయితే, నాయకుని దార్శనికత వాటిని ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో వెలుగుచూస్తుంది. మన చేతులలో లేని ప్రమాదాల తీవ్రతను తగ్గించే అవకాశాలు లేని సమయంలో ప్ర మాదాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సన్నద్ధమవడం నాయకుని స్థాయిని పెంచుతుంది.
ప్రస్తుతం ఇరాన్, ఇ జ్రాయిల్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రధానమంత్రి మోడీ ప్రమాదా న్ని పసిగట్టడంలోనూ,అవసరమైన చర్యలు చేపట్టడంలోనూ అపజయం పాలయ్యారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అలీన ఉ ద్యమానికి కట్టుబడిన భారతదేశం పరోక్షంగానైనా ఇజ్రాయిల్ అమెరికా కూటమికి వ త్తాసు పలుకుతున్నదని మేధావుల వాదన. అలాకాదు..
అదొక వ్యూహమని కొందరి వా దన. ఏది ఎలా ఉన్నా.. ప్రత్యక్షంగా యుద్ధం తో సంబంధం లేకున్నా, యుద్ధం వల్ల ఏర్పడిన పరిణామాలకు భారతదేశమూ బాధప డుతూ ఉన్నది. గ్యాస్, చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోవడమూ.. పెరిగిన ధరలకు కొనాలన్నా రవాణాకు అవకాశం లేకపోవడమూ కారణంగా దేశంలో చమురు, గ్యాస్ లభ్యత మందగించడం అనివార్యమయింది.
ఫలించిన భారత దౌత్యనీతి
బలహీనపడిన రూపీ మారకపు విలువ వల్ల దిగుమతులు మరింత భారంగా మారి ద్రవ్యోల్బణాగ్నికి ఆజ్యం పోయవచ్చు. యు ద్ధం చాలాకాలం కొనసాగితే.. విదేశీ పెట్టుబడులకు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక పురోగతి మందగించే అవకాశం ఉన్నది. అయితే భారత దౌత్యనీతి ఫలించడం వల్ల హర్మోజ్ జలసంధి నుంచి భారత నౌకలకు అనుమతి లభించి మొదటి నౌక ముంబైని చేరడం ముదావహం.
దార్శనికత కలిగిన భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాద తీవ్ర తను తగ్గించ గలిగింది. ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్ర త్యామ్నాయ మార్గాలపై దృష్టిని సారించడం వల్ల ఇంధన భద్రతను సాధించే ప్రయత్నం చేస్తున్నది. చమురు నిల్వలను పెంచుకునేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నది. స్వదేశీ చమురు ఉత్పత్తులను పెంచుకోవడం వల్ల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. దానితో విదేశీ మారక ద్రవ్యమూ ఆదా అవుతున్నది.
ప్ర పంచ వ్యాపార స్థితిగతులను సునిశితంగా పరిశీలిస్తూ తన ఆర్థిక విధానాలను తగిన విధంగా రూపొందించు కుంటున్నది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ద్వారా సుస్థిరతను సాధించే ప్రయత్నం చేస్తున్నది. విదేశా లతో దౌత్య సంబంధాలను పెంచుకోవడం ద్వారా శాంతిసౌభాగ్యాలను స్థిరీకరించుకునే ప్రయత్నం చేస్తున్నది. యుద్ధాలను ఆరంభించడం సులువే కాని దానిని ముగించడం అత్యంత క్లిష్టమైనది. యుద్ధంలో ఏ పక్షమూ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. పాలకుల అహంకార భావనలు, రక్త దాహం, ఆ ధిపత్య ధోరణులు,అవాంచనీయ యుద్ధాలను తెచ్చిపెడుతున్నాయి.
ఏ రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించినా అదీనాడు ప్ర పంచవ్యాప్తంగా అన్ని దేశాలపై, ప్రత్యక్షంగా/ పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. విలువైన మానవ వనరులు ఆవిరైపోతాయి. మొన్న కూటమి వేసిన బాంబుల దాడిలో బలైన 180 మంది ఇరానియన్ అమాయక బాలికలను ఏ యుద్ధమూ సజీవంగా తెచ్చివ్వలేదు. భావి తరాలు యుద్ధాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
భారతదేశమూ దానికి అతీతం కాదు. ప్రభుత్వ ప్రతిపక్షాలు సమన్వయంతో సహకరించుకొని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వవలసిన సమయంలో భారతదేశంలో ఆ సమన్వయం లేకపోవడం శోచనీయం. ఇలాంటి యుద్ధ ప్రమాదాలను గుర్తించిన చాణక్య కనీసం ప్రమాదాన్ని తగ్గించే విధానాలను తెలిపే ప్రయత్నం చేసాడు.




