మన గానకోకిలకు ఏది తగిన వీడ్కోలు?
ఎస్ జానకి మరణంతో ‘ప్రాంతీయ గౌరవం’పై సర్వత్రా చర్చ
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఆరు దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి జూలై 11న మైసూరులో 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మరణం అనంతరం కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించగా, ఆమె స్వస్థలమైన తెలుగు రాష్ట్రాల స్పందనపై పలువురు అభిమానులు, సంగీత ప్రేమికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం జానకమ్మ భౌతికకాయాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, పూర్తి రాష్ట్ర లాంఛనాలతో నివాళులు అర్పించింది. అనంతరం కనియనహుండిలోని ఆమె కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు ఆమె అమర గీతాలను ఆలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, హంసలేఖ, గాయని పీ సుశీల, గాయకుడు కేజే యేసుదాస్ తదితరులు హాజరై ఆమెకు నివాళులర్పించారు.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా (ప్రస్తుత బాపట్ల జిల్లా) రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి తన బాల్యంలో ఎక్కువ కాలం నేటి తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో పెరిగారు. ఐదేళ్ల వయసు నుంచే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వినిపించే భక్తిగీతాల ప్రభావంతో సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, తర్వాత దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గానకోకిలగా ఎదిగారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన జానకమ్మ ప్రతి భాషలోనూ అద్భుతమైన ఉచ్ఛారణ, భావ వ్యక్తీకరణతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచు కున్నారు. ఆమెకు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పుర స్కారాలు లభించాయి.
జానకమ్మ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే వ్యక్తిగతంగా ప్రముఖులు నివాళులు అర్పించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో అధికారిక గౌరవం లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల స్పందన ప్రధానంగా సామాజిక మాధ్యమాలకే పరిమితమైందని, మైసూరులో జరిగిన అంత్యక్రియలకు ఇరు రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరు కాకపోవడం, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల హాజరు కూడా తక్కువగా ఉండటం అభిమానులను నిరాశకు గురిచేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కనిపించిన గౌరవప్రదమైన స్పందనతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల వైఖరి చర్చనీయాంశమైంది.
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సమకాలీన నటీనటులు, సాంకేతిక నిపుణుల చుట్టూ తిరిగే సంస్కృతి పెరగడంతో, పలు తరాలను ప్రభావితం చేసిన దిగ్గజ కళాకారుల సేవలకు తగిన గుర్తింపు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో భాషలకు అతీతంగా సాగిన కళాకారుల సహకారం, సాంస్కృతిక అనుబంధం క్రమం గా బలహీనపడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జానకమ్మ మరణం.. ఒక గొప్ప కళాకారిణి కేవలం ఒక రాష్ట్రానికే చెందినది కాదని, ఆమె గానం ఆలకించిన ప్రతి హృదయానికీ చెందుతుందని మరోసారి గుర్తు చేసింది. ఆమెకు అందించే నిజమైన నివాళి, ఆమె ఆలపించిన అమర గీతాలను భావితరాలకు అందిస్తూ, ఆమె సంగీత వారసత్వాన్ని చిరకాలం సజీవంగా ఉంచడమే.
ఎద్దులబండిపై వేములవాడ వెళ్లి..
సిరిసిల్లతో తనకు అనుబంధం ఉన్న విషయాన్ని స్వయంగా జానకమ్మ పలుమార్లు ఇంట ర్వ్యూల్లో వెల్లడించారు. సిరిసిల్లతో తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా తమ కుటుంబం సిరిసిల్లలో ఉన్నప్పుడు తాను మూడేళ్ల వయసులో ఉన్నానని తెలిపారు. సిరిసిల్ల నుంచి ఎద్దులబండిపై వేములవాడ వెళ్లి ‘బాలనాగమ్మ’ సినిమా చూశానంటూ మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారామె.
ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలదే ఆ బాధ్యత
జానకమ్మకు శాశ్వత నివాళిగా సిరిసిల్ల లేదా గుంటూరులో ఆమె పేరిట సంగీత అకాడమీ, సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయడం, వార్షిక సంగీత పురస్కారం లేదా స్మారక సంగీత ఉత్సవాన్ని ప్రారంభించడం వంటి చర్యలను తెలుగు రాష్ట్రాలు చేపట్టాలని అభిమానులు కోరుతున్నారు. అలాంటి కార్యక్రమాలు ఆమె అసాధారణ సంగీత సేవలను చిరస్థాయిగా నిలబెట్టడమే కాకుండా, దక్షిణ భారతీయ సినీ సంగీతానికి ఉన్న ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని కూడా భావితరాలకు పరిచయం చేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.






