24 April, 2026 | 3:29 AM

మాస్కులు ధరించి.. కాల్పులు జరిపి..!

24-04-2026 12:39 AM
  1. హోర్ముజ్‌లో స్పీడ్‌బోట్లలో వాణిజ్య నౌకలను వెంబడించిన కమాండోలు
  2. భారత్ సహా రెండు నౌకల స్వాధీన వీడియో విడుదల చేసిన ఐఆర్‌జీసీ

టెహ్రాన్, ఏప్రిల్ 23: హోర్ముజ్ జలసంధిలో భారతదేశానికి వెళ్తున్న ఓడతో సహా రెండు వాణిజ్య నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత, ముసుగు ధరించిన కమాండోలు ఆ నౌకలను ఎలా వెంబడించారు, వాటిపైకి ఎలా ఎక్కారు, చివరికి వాటిని ఎలా స్వాధీనం చేసుకున్నారో చూపిస్తున్నట్లు ఉన్న వీడియో ఫుటేజీని ఐఆర్‌జీసీ గురువారం విడుదల చేసింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా ఉన్న ఈ వీడియోను చూస్తే.. హోర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

బుధవారం, ట్రంప్ ఏకపక్షంగా కాల్పుల విరమణను పొడిగించిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ నౌకాదళం పనామా జెండా కలిగిన ఎంఎస్‌సీ ఫ్రాన్సెస్కా, లైబీరియా జెండా కలిగిన ఎపామినోండాస్ అనే రెండు నౌకలపై దాడి చేసి, వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎపామినోండాస్ నౌక దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తోంది. ఈ రెండు నౌకలను ముసుగు ధరించిన కమాండోలు ఇరాన్ తీరానికి తిరిగి తీసుకువెళ్లారు. ఇరాన్ సైనికులు ఈ నౌకలను స్వాధీనం చేసుకోవడానికి హాలీవుడ్ సినిమాను మించి స్టంట్లు చేశారు.

వీడియోలో ఇరాన్ సైనికులు స్పీడ్‌బోట్లలో సరుకు రవాణా నౌకలను సమీపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత, ముసుగులు ధరించిన ఇరాన్ సైనికులు, రైఫిళ్లతో ఒక నిచ్చెన ఎక్కి ఎంఎస్సీ ఫ్రాన్సెస్కా నౌకలోకి ప్రవేశించారు. ఎపామినోండాస్ నౌకలో, ముసుగులు ధరించిన కమాండోలు రైఫిళ్లతో సోదాలు నిర్వహిస్తూ ఇంజిన్ రూమ్‌లోకి ప్రవేశించి, ఆ తర్వాత నౌకపైకి ఎక్కుతున్నట్లు దృశ్యాలు ఉన్నాయి. భారతదేశానికి వెళ్తున్న ఎపమినోండాస్ నౌకలోని బ్రిడ్జి (కేంద్ర కమాండ్ సెంటర్) ఇరాన్ సైనికులు తమ స్పీడ్‌బోట్ నుంచి కాల్పులు జరిపి, గ్రేనేడ్లు విసరడంతో దెబ్బతింది. అయితే, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

రాన్ తీరానికి సుమారు ఆరు మైళ్ల దూరంలో ఉన్న ఎంఎస్సీ ఫ్రాన్సెస్కా నౌకపై కూడా భారీ కాల్పులు జరిగాయి. ఈ నౌకలకు అవసరమైన అనుమతి లేదని, అవి నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేశాయని, తద్వారా సముద్ర భద్రతకు ప్రమాదం కలిగించాయని ఐఆర్జీసీ తెలిపింది. జలసంధి నిబంధనలకు భంగం కలిగించే చర్యలను ‘రెడ్ లైన్’గా పరిగణిస్తామని కూడా అది హెచ్చరించింది. ఈ నౌకల స్వాధీనాల వెనుక శక్తివంతమైన ఐఆర్జీసీ నడిపే ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ -పడవలు ఉన్నాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

అయితే, భారతదేశానికి వస్తున్న నౌకపై జరిగిన ఈ దాడి ఢిల్లీ, టెహ్రాన్‌ల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం అయ్యే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్, ఇరాక్, చైనా, రష్యా వంటి ఐదు ‘స్నేహపూర్వక‘ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని ఇరాన్ రాజకీయ నాయకత్వం హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడి జరిగింది. గతవారం, ‘జగ్ అర్నవ్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే రెండు భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడి చేసిన విషయం తెలిసిందే.