4 May, 2026 | 2:53 AM

ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

04-05-2026 01:47 AM

కూసుమంచిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

కూసుమంచి, మే 3(విజయక్రాంతి): ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులను పంపించి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పాలన తీసుకెళ్తున్నామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా దరఖాస్తులు స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గత 2.4 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింత ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామని అన్నారు.. ప్రజాదర్బార్ లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును పార్టీలకతీతంగా పరిష్కరిస్తామని, కొన్ని దరఖాస్తులను ఇక్కడే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సాదా బైనామా, భూమి రికార్డు సమస్యలు, నిషేధిత జాబితా సమస్యలు వంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ప్రతి ప్రజా దర్బార్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని, గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మే నెలాఖరులో రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మూడవ, నాలుగవ దశల్లో కూడా ఇళ్లు మంజూరు కొనసాగుతాయని అన్నారు. వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంటలు కొనుగోలు చేసిన వెంటనే వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.  సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు.

మే 5 నుంచి 7 వరకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రతి క్లస్టర్కు 1500 నుంచి 2000 వరకు దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. అందిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అర్హమైన ప్రతి దరఖాస్తును తప్పకుండా పరిష్కరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.