09-02-2026 01:38:28 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 08 (విజయక్రాంతి): హైదరాబాద్‌నగర రహదారులపై ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిం చే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని నగర ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీసుల కళ్లుగప్పి చలాన్ల నుం చి తప్పించుకోవడానికి వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్‌కు పాల్పడటం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో నంబర్ ప్లేట్ మార్చి మరో వాహనదారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వివరాలతో పాటు, నగరవ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల గణాంకాలను వెల్లడించారు.
కేటుగాడి అరెస్ట్
మలక్‌పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నంబర్‌లోని ఓ అంకెను మార్చి వాడుతున్నాడు. ఇతడు చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల అసలైన వాహన యజమాని ఫహీమ్ అలీ వాహనంపై ఏకంగా 23 చలాన్లు తప్పు గా నమోదయ్యాయి. దీనిపై బాధితుడు పో లీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన చాదర్‌ఘాట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అతడిపై మోటార్ వాహనాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, నగరంలో ఫిబ్రవరి 6,7 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందు బాబులు భారీగా పట్టుబడ్డా రు. రెండు రోజుల్లోనే మొత్తం 604 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమో దు చేశారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.