09-02-2026 01:39:32 AM
కొత్వాల విమలాదేవి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
ఎన్నికల ప్రచారంలో కొత్వాల శ్రీనివాసరావు
పాల్వంచ, ఫిబ్రవరి 8, (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాల్వంచ పట్టణ పరిధిలోని 46వ డివిజన్ లో కొత్వాల విమలాదేవి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. గత పాలకులు పాల్వంచ పట్టణంలోని 46వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని అవాక్కులో చవాకులు పేలుతున్నారని, కనీసం స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు. సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్వాల విమలాదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ పరిధిలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు.
ప్రధానంగా పాత పాల్వంచలో స్మశాన వాటిక ఏర్పాటు చేయడం, వీధిలైట్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మానించడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, పాత పాల్వంచలో గ్రంథాలయాన్ని పునర్ ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల కోసం హామీలు ఇచ్చే, రంగురంగుల జండాలతో వచ్చే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ఈ ప్రాంత బిడ్డగా మీ ఆడబిడ్డగా కాంగ్రెస్ ఆశీస్సులతో పోటీలో ఉన్న విమలాదేవిని ఆశీర్వదించాలని కోరారు. డివిజన్ పరిధిలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.