21-02-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): బీసీలను రాజకీయంగా అణిచివేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీసీ నాయకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని అవమానించి, కిడ్నాప్ చేయించిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశంలో కౌన్సిలర్ యాదగిరితో కలిసి మాట్లాడారు. బీసీలపై అణచివేతకు పాల్పడుతున్న మంచిరెడ్డిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని బీఆర్‌ఎస్ అధిష్టానానికి విన్నవించారు. జనరల్ సీటు అంటే అది కేవలం రెడ్డిలకే రిజర్వేషన్ అని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావిస్తున్నారా జనరల్ స్థానంలో గెలిచిన బీసీల కు చైర్మన్ పదవి అడిగే హక్కు లేదా అని ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 21 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలే గెలిచారని, మెజారిటీగా ఉన్న బడుగులను కాదని కేవలం ఇద్దరు ముగ్గు రు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చైర్మన్ పీఠం ఎలా కట్టబెడతారని నిలదీశారు. 48 గంటల్లో మంచి రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చలో ఇబ్రహీంపట్నం చేపడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఐదు శాతం ఉన్న రెడ్డిల పక్షమా లేక 90 శాతం ఉన్న బడుగుల పక్షమా అన్నది తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకుడిపై కిడ్నాప్ కు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ.. మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి ఎంపీటీసీగా, వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తనను కేవలం బీసీ అనే కారణంతో మంచిరెడ్డి అవమానించారని ఆరోపించారు. చైర్మన్ పదవి అడగ గానే..
నీవు బీసీవి నీకెందుకు ఇవ్వాలి ఎన్ని కోట్లు ఇస్తావు అంటూ మంచిరెడ్డి ఆయన కుమారుడు నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. కిడ్నాప్ చేసి మానసికంగా, శారీరకంగా హింసించారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్ కుర్మా, మణిమంజరి సాగర్, గొడుగు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.