calender_icon.png 21 February, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరకప్రాయంగా మారిన రహదారి

21-02-2026 12:15:40 AM

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

మొయినాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): మొయినాబాద్ మండలం హిమత్నగర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా ప్రధాన రహదారిపై అండర్డ్రైనేజ్ నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మురుగు నీటిలో ప్రయాణం వల్ల భక్తుల అవస్థలు పడుతున్నారు. హిమత్నగర్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు నిల్వ ఉండటంతో అటుగా వెళ్లే వారికి దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణం గా  దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మురుగు నీటిలోనే నడవాల్సి వస్తోందని వర్షం లేకపోయినా అండర్డ్రైనేజ్ లీకేజీల వల్ల రోడ్డు చెరువును తలపిస్తోంది. అధికారులకు సమస్య గురించి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని స్థానికులు అధికారుల ఉదాసీనతపై విమర్శలు చేస్తున్నారు. సమస్యపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కనీస చర్యలు తీసుకోకపోవడం విచారకరం. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రత గాలీలో దీపంలా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

వెంటనే డ్రైనేజీ లీకేజీని గుర్తించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. రోడ్డుపై పేరుకుపోయిన మురుగును తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే, గ్రామస్తులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు.