30 April, 2026 | 5:29 PM

సోమశిలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

30-04-2026 03:16 PM

కొల్లాపూర్ రూరల్:  నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం సోమశిలను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకో టూరిజం ప్రాజెక్టులు, హేలీ టూరిజం, పర్యాటక సదుపాయాలు, అలాగే 167కే జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఐకానిక్ కేబుల్ వంతెన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సోమశిల వంటి ప్రకృతి సోయగాలున్న ప్రాంతాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి టూరిజం హబ్‌లుగా మారే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

నల్లమల కొండలు, కృష్ణా నది బ్యాక్‌వాటర్స్‌, అడవుల పచ్చదనం వంటి సహజ అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యాటకులకు అవసరమైన వసతులు, భద్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న కేబుల్ వంతెన పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడటంతో పాటు పర్యాటక రాకపోకలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.