29 June, 2026 | 1:46 PM

సుప్రీంకోర్టుకు అయోధ్య విరాళాల చోరీ అంశం

29-06-2026 12:45 PM

అత్యవసర విచారణను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం

ఆకాశం కూలిపోదు.. అంత అత్యవసరం ఏముంది?

న్యూఢిల్లీ: అయోధ్య విరాళాల చోరీ(Ram Mandir donation case) అంశం సుప్రీంకోర్టుకు(Supreme Court) చేరింది. అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జస్టిస్‌లు ఎం.ఎం. సుందరేష్, శీల్ నాగులతో కూడిన ధర్మాసనం, ఈ కేసును వేసవి సెలవుల తర్వాత విచారణకు జాబితా చేస్తామని తెలిపింది.

"ఆకాశమేమీ కూలిపోదు కదా... అంత అత్యవసరం ఏముంది?" అని ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారాలు, నిర్వహణకు సంబంధించి ఆరోపించబడిన ఆర్థిక అవకతవకలు, ఇతర చట్టవిరుద్ధమైన చర్యలపై సీబీఐ నేతృత్వంలోని బహుళ-విభాగాల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు జరపాలని న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.