మహిళా సంఘాలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాం
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్త్రీనిది రుణాల రికవరీని అక్టోబర్ చివరి నాటికి 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఐకేపీ, స్త్రీనిది, మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రికవరీలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్త్రీనిది నిధులను దుర్వినియోగం చేసిన వీవీఏలు వారం రోజుల్లోగా చెల్లించకపోతే టర్మినేట్ చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లాకు కేటాయించిన ఈ-బైకులు, ఈ-ఆటోలను లబ్ధిదారులకు అందించాలని, 125 పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్లకు లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేయాలని సూచించారు. మహిళా సంఘాలు ఈ-కామర్స్‌లోకి ప్రవేశించి వ్యాపారవేత్తలుగా ఎదగాలని, చేపల పెంపకంపై మహిళలను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






