21 July, 2026 | 10:35 PM

Breaking News

బూర్గంపాడు గ్రంథాలయానికి మూత్రశాలల సౌకర్యం కల్పించాలి

21-07-2026 09:23 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయానికి మూత్రశాలలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి. పున్నం చంద్ డిమాండ్ చేశారు. మంగళవారం గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. బూర్గంపాడు గ్రంథాలయానికి దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రతిరోజూ 100 నుంచి 200 మంది వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, పాఠకులు గ్రంథాలయాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు.

అయినప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం విచారకరమన్నారు. కాలానికి అనుగుణంగా గ్రంథాలయాన్ని ఆధునికీకరించి డిజిటలైజేషన్ చేపట్టాలని, పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అత్యవసరంగా మూత్రశాలల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.గ్రంథాలయ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన వసతులు కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.