21 July, 2026 | 10:36 PM

Breaking News

ప్రకృతి ఆరాధనకు ప్రతీక శీతల భవానీ పండుగ

21-07-2026 09:21 PM

బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం: 

ఐటిడిఏ పీవో రాహుల్

బూర్గంపాడు,(విజయక్రాంతి): బంజారా గిరిజనుల పవిత్ర ప్రకృతి ఆరాధన పండుగైన శ్రీ శీతల భవానీ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం మండలంలోని అంజనాపురం గ్రామ శివారులో నిర్వహించిన శీతల భవానీ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బంజారా గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.

రాహుల్ మాట్లాడుతూ.. ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే వేళ ప్రకృతికి కృతజ్ఞతగా బంజారాలు శీతల భవానీ పండుగను నిర్వహిస్తారని తెలిపారు. తండా ప్రజలు, పశుసంపద సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు దరిచేరకుండా అమ్మవారిని ప్రార్థించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.శీతల భవానీని గ్రామ రక్షక దేవతగా భావించే బంజారాలు తరతరాలుగా మంగళవారం రోజునే ఈ పండుగను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

పూజల అనంతరం మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో నృత్యాలు చేస్తూ, భక్తి గీతాలు ఆలపించడం ఈ వేడుకల ప్రత్యేకత అని తెలిపారు.తండా ప్రజలు గ్రామ శాంతి, ఆరోగ్యం, సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ ఆచారాలను పాటించారని చెప్పారు. బంజారా సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బంజారా పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.