2 August, 2026 | 1:18 AM

పర్యావరణాన్ని పరిరక్షించాలి

02-08-2026 12:08 AM
  1. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి
  2. అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి

హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో పోలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో సీటీజీ - సిటీ టెర్రస్ గార్డెనర్స్ సహకారంతో నెక్లెస్ రోడ్‌లో జరుగుతున్న నర్సరీ మేళాలో ఇంటింటికి ఉచితంగా ఐదు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి, ఐఎఫ్‌ఎస్ పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం, రసాయన అవశేషాలు ఉన్న ఆహరంపై ఆందోళనలు, జీవనశైలి వ్యాధుల పెరుగుదల వంటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం,పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యన్ని పెంచడం లక్ష్యంగా ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ( మూడు పండ్ల, రెండు ఔషధ లేదా అలంకరణ మొక్కలు) ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకి పంపిణీ చేయాలనీ మహాలక్ష్యంతో హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ పనిచేస్తోందన్నారు.

శనివారం 800 కుటుంబాలకు నాలుగువేల మామిడి, ఉసిరి, నిమ్మ, గోరింట, నిమ్మ గడ్డి, అకాల్‌ఫా బ్రౌన్, టెకోమా గాడిచౌది, జమ్మి మొక్కలు పంపిణి చేశారు. ఈ నగరంలోని నివాసల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు ఒక ఉద్యమంలా తీసుకొని ఈ నగరాన్ని, హరిత నగరంలా, ఆరోగ్యవంతమైన మహానగరంలా తీర్చి దిద్దాలని రోహిత్ కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చక్రపాణి, హెచ్‌ఎండీఏ ప్రజా సంబదాల అధికారి శ్రీకాంత్, సిటీ టెర్రస్ గార్డెన్స్ కో ఫౌండర్ సరోజ, హార్టికల్చర్ ఆఫీసర్ జ్ఞాన సుందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సౌమ్య, ప్లాంటేషన్ అసిస్టెంట్ రాము పాల్గొన్నారు.