హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ముగ్గురు మృతి
మొఖంపూర: జైపూర్ జిల్లాలోని డుడు సమీపంలో, జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై(Jaipur-Ajmer National Highway) సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
చిత్తోర్‌గఢ్ నుండి సుమారు 20 మంది ప్రయాణికులతో జైపూర్‌కు వెళ్తున్న బస్సులో యాక్సిల్ విరిగిపోవడం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో, డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసిన సమయంలో మొఖంపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో, బస్సు సమీపంలో నిలబడి ఉన్న మధురాజ్ (30), రాహుల్ (29),బస్సు డ్రైవర్ సతారామ్ (30) మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.






