29 June, 2026 | 12:16 PM

నాణ్యతలో రాజీ లేదు.. గడువులో పూర్తి చేయాలి

29-06-2026 10:56 AM

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలనలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గంలోని జట్రపోల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల( integrated residential school) భవన పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పాఠశాల భవనంలోని తరగతి గదులు, పరిపాలనా విభాగం, బాలురు–బాలికల వసతి గృహాలు, డైనింగ్ హాల్, వంటశాల, ప్రయోగశాలలు, గ్రంథాలయం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారులు, ప్రహరీ గోడ తదితర నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, నిర్మాణంలో నాణ్యమైన సామగ్రినే వినియోగించాలని, ఇంజినీరింగ్ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా, వసతి, క్రీడా సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందన్నారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తిగా ఈ భవనం నిలిచేలా ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేయాలని, నిర్మాణ సంస్థలు, ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, సంబంధిత శాఖల అధికారులు, ఐడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.