7 April, 2026 | 2:57 AM

బహుజన ఓరుగల్లు పోరుగర్జన విజయవంతం చేయాలి

07-04-2026 01:00 AM

బచ్చన్నపేట, మార్చి 6 (విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తమ్మడి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  ఏప్రిల్ 14న వరంగల్లో కేడీసి కాలేజ్ గ్రౌండ్ లో జరగే బహుజన ఓరుగల్లు పోరుగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు నీర్మాల రత్నం, జిల్లా అధ్యక్షులు మడిపడిగ చంద్రశేఖర్ హాజరై  మాట్లాడుతూ బహుజనులపై జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ, రాజకీయ మోసాలకు ఇక చెక్ పెట్టే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

ఇక మౌనం కాదని పోరాటమే మార్గం అంటూ బహుజన సమాజాన్ని ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్  చూపిన మార్గంలో నడుస్తూ బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఈ సభ ఒక చారిత్రాత్మక గర్జనగా నిలుస్తుందన్నారు.

ప్రస్తుత, గత ప్రభుత్వాలు బహుజనుల ఆశయాలను మోసం చేశాయని, వారి హక్కులను కాలరాసాయని తీవ్రంగా విమర్శించారు. ఇకపై బహుజనులు చూసే ప్రేక్షకులు కాదు, చరిత్రను రాసే నాయకులమని స్పష్టం చేశారు. ఈ సభ బహుజనుల ఆత్మగౌరవానికి నాంది పలికే పోరుగర్జనగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి గొల్ల ఆనంద్, గందమాల చందు,కర్రె అశోక్, గోల్లూరి ప్రదీప్ పాల్గొన్నారు.