యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మంథని లో మాదకద్రవ్యాల వ్యతిరేక, అవగాహన కార్యక్రమంలో ఏసిపి రమేష్
మంథని, జూన్ 24(విజయ క్రాంతి): ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు మరియు సోషల్ మీడియా దుర్వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని గోదావరిఖని ఏసిపి రమేష్ హెచ్చరించారు. మంథని పట్టణంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ యువతకు పలు సూచనలు చేశారు.
భవిష్యత్తుపై ప్రభావం
చిన్న చిన్న తప్పులు చేసి పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం యువత బంగారు భవిష్యత్తును దెబ్బతీస్తుందని, ముఖ్యంగా ఆధార్ కార్డుతో అనుసంధానమైన పోలీసు రికార్డులు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు తీవ్ర ఆటంకంగా మారతాయని ఆయన పేర్కొన్నారు.
నిరంతర నిఘా
మత్తు పదార్థాల అమ్మకాలు ,సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు వ్యవస్థ నిరంతరం నిఘా ఉంచుతుందని, తెలియకుండా చేసే పొరపాట్లు కూడా జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయని ఆయన హెచ్చరించారు.
తల్లిదండ్రుల ఆశలు
కష్టపడి పనిచేస్తూ, తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలను సాకారం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవరచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంథని సిఐ బుద్ధే స్వామి, ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ మల్లయ్య గౌడ్, సిబ్బూత దితరులు పాల్గొన్నారు.






