రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు
జైనూర్‌లో రూ.1.25 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభం
జైనూర్(విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మా భోజ్జు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ బుధవారం ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మూడు మండలాలకు చెందిన రైతులు మార్కెట్ కార్యకలాపాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా గుర్తింపు పొందిన దుకాణాల్లోనే కొనుగోలు చేసి, ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలని సూచించారు.బిల్లు ఉంటే ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాష్ట్రం నుంచి వరి ధాన్యం వస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక్కడి రైతులు మోసపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






